Categories: LEGAL

అక్రమ కాలనీల నిర్మాణం.. 31 మందిపై కేసు

అక్రమంగా కాలనీలు నిర్మించిన 31 మంది వ్యక్తులపై గుర్గావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరం లోపల, చుట్టూ ఉన్న దాదాపు 30 ఎకరాల స్థలంలో ఏడు కాలనీలను అక్రమంగా నిర్మించారు. దీనిపై డిపార్ట్ మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భోండ్సీ, ఫరూక్ నగర్, ఘామ్రోజ్ లలో రెండు నుంచి ఎనిమిది ఎకరాల్లో గత కొన్ని నెలల్లో ఈ కాలనీలు పుట్టుకొచ్చాయని పోలీసులు తెలిపారు. భోండ్సీలో దాదాపు 11.5 ఎకరాల్లో మూడు అక్రమ కాలనీలు నిర్మించారని వివరించారు. ఇక ఫరూక్ నగర్ లో 12.5 ఎకరాల వ్యవసాయ భూమిలో మూడు కాలనీలు వెలిశాయని పేర్కొన్నారు. ఘామ్రోజ్ లో ఐదుగురు వ్యక్తులు ఆరు ఎకరాల్లో ఒక కాలనీ నిర్మించారని ఫిర్యాదు వచ్చినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ఏడు కాలనీలను అక్రమంగా నిర్మించిన 31 మంది వ్యక్తులపై ఆయా పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిబంధనల ప్రకారం అర్బన్ ఏరియాలో కాలనీ నిర్మించే ముందు సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంది. అలాగే ఒక సబ్ డివిజన్ ను కాలనీగా విభజించడం కూడా నిబంధనలకు విరుద్ధం. కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్టుగా అక్రమ కాలనీలు నిర్మించడంతో డీటీసీపీ ఫిర్యాదు చేసింది.

This website uses cookies.