కోడలిపై హత్యాయత్నం, గృహహింస వేధింపులతో అరెస్టు అయి జైలులో ఉన్న ఓ బిల్డర్.. బెయిల్ పై విడుదల కావడానికి కొద్దిసేపటి ముందు మరో కేసులో అరెస్టయ్యారు.
పాపులర్ బిల్డర్స్ యజమాని రమణ్ పటేల్ ను మూడు దశాబ్దాల నాటి కేసులో అహ్మదాబాద్ జిల్లా సనంద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్న రమణ్ పటేల్ ను ట్రాన్స్ ఫర్ వారెంట్ ద్వారా అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. 2020 ఆగస్టు నుంచి జైలులో ఉన్న ఆయనకు మంగళవారం ఉదయం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన విడుదల కావాల్సి ఉండగా.. మరో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. సనంద్ లోని చెక్లా గ్రామానికి చెందిన రైతు కాను పటేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమణ్ పటేల్ అరెస్టయ్యారు. తమ కుటుంబానికి తాతముత్తాల నుంచి 62,500 చదరపు మీటర్ల రెండు స్థలాలు వారసత్వంగా వస్తున్నాయని, 1994, 1996లో నకిలీ పత్రాల సహాయంతో రమణ్ పటేల్ తన తండ్రిని మోసం చేసి వాటిని ఆక్రమించుకున్నారని కాను పటేల్ ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు నేరం రుజువు కావడంతో రమణ్ పటేల్ ను అరెస్టు చేశారు. కాగా, సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో రమణ్ పటేల్, అతడి సోదరుడు దశరథ్ పటేల్ సీబీఐ సాక్షులుగా ఉన్నారు. వీరిపై నకిలీ పత్రాలతో మోసం చేసిన అనేక కేసులు కూడా ఉన్నాయి.