Categories: LATEST UPDATES

నివాస సంఘానికి వ్యతిరేకంగా యజమానుల ధర్నా

అపార్ట్ మెంట్ ఓనర్ల‌ అసోసియేషన్ (ఏఓఏ)కి వ్యతిరేకంగా అందులోని యజమానులు ధర్నా నిర్వహించారు. కొత్త ఎగ్జిక్యూటివ్ బాడీని ఎన్నుకోవడానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నోయిడాలోని సెక్టార్ 120లో ఆర్ జీ రెసిడెన్సీ ఉంది. అయితే, ప్రస్తుతం ఏఓఏ కమిటీ ఎలాంటి ఎన్నికలూ లేకుండా ఏర్పడిందని, వెంటనే దానిని తొలగించి, ఎన్నికల ద్వారా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు యజమానులు ఆందోళనకు దిగారు. అపార్ట్ మెంట్ ఆవరణలో భారీ ర్యాలీ తీశారు. ప్రస్తుత కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మొత్తం 1540 ఫ్లాట్లున్న ఈ అపార్ట్ మెంట్ లో 1300 మంది తమ ఫ్లాట్లను ఆక్యుపై చేశారు. అయితే, ఏఓఏ కమిటీ ఎలాంటి ఎన్నికా లేకుండానే ఏర్పడిందని పేర్కొంటూ పలువురు యజమానులు ఫిర్యాదులు చేయడంతో.. సొసైటీ బైలాస్ ప్రకారం కొత్త కమిటీని ఎన్నికల ద్వారా ఎన్నుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ గతేడాది డిసెంబర్ లో ఆదేశించారు. అయితే, 8 నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతీ లేకపోవడంతో యజమానులు ఆందోళనబాట పట్టారు.

గత ఎనిమిది నెలల్లో ఈ ఎన్నికల కోసం ఇద్దరు పరిశీలకులను సైతం జిల్లా రిజిస్ట్రార్ నియమించారని, కానీ ఎన్నికలు మాత్రం జరగలేదని, వాటిని జరగనీయకుండా ఏఓఏ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈనెల 8న ఎన్నికల అధికారిని సైతం నియమించగా.. ఏఓఏ మాత్రం ఆ ప్రక్రియ జరగనివ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, ఈ ఆరోపణలను ఏఓఏ ఖండించింది. తాము సొసైటీ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు పేర్కొంది.

This website uses cookies.