జీవో నెం.111 పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో అక్రమంగా స్టోన్ క్రషింగ్ యూనిట్లు నిర్వహిస్తున్నవారిపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్ పీసీబీ) కొరఢా ఝళిపించింది. ఒక్కో యూనిట్ కు రూ.5.5 కోట్ల జరిమానా విధించింది. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారంటూ హైదరాబాద్ కు చెందిన పీవీ సుబ్రమణ్య శర్మ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. వట్టినాగులపల్లి, కోకాపేట, గౌలుదొడ్డి, గోపనపల్లి, కొల్లూరు, కొత్వాలగూడ, ఉస్మాన్ సాగర్ తదితర ప్రాంతాల్లో క్రషింగ్ యూనిట్లు ఉన్నాయని నివేదించారు.
గత నెలలో దీనిపై విచారించిన ట్రైబ్యునల్.. సమగ్ర నివేదిక అందజేయాలని టీఎస్ పీసీబీని ఆదేశించింది. అనంతరం బోర్డు అధికారులు ఆయా ప్రాంతాల్లో క్రషింగ్ స్టోన్ యూనిట్లను పరిశీలించారు. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ అవి తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో ఒక్కో యూనిట్ పై రూ.5.5 కోట్లు జరిమానా విధించారు. ఇందులో గ్రేట్ ఇండియా మైనింగ్, శ్రీ లక్ష్మీ నరసింహ మెటల్ ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మీ కన్ స్ట్రక్షన్స్, హైదరాబాద్ రాక్ శాండ్, ఆదేశ్వర్ ట్రేడర్స్, తేజారెడ్డి క్రషర్స్, సీఎస్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తదతరాలు ఉన్నాయి.
This website uses cookies.