Categories: TOP STORIES

పండ‌గ వేళ.. ప‌దండీ కొత్తింట్లోకి!

  • పండగ వేళ ప్రాపర్టీల కొనుగోలుకు జనం మొగ్గు
  • పర్వదినాలు కావడంతో మంచి
    జరుగుతుందనే సెంటిమెంటే కారణం

పండ‌గ‌లొస్తే చాలు రియ‌ల్ రంగానికి పెద్ద పండ‌గే. ఎందుకంటే, అధిక శాతం మంది సొంతిల్లు కొనుగోలు చేసేదీ స‌మ‌యంలోనే. వినాయక చవితి నుంచి ఆరంభ‌మ‌య్యే పండ‌గ సీజ‌న్ నుంచి ఫ్లాట్ల అమ్మ‌కాలూ పెరుగుతాయి. ఇదే అద‌నుగా భావించి ప‌లువురు బిల్డ‌ర్లు ప్ర‌త్యేక రాయితీల‌నూ ప్ర‌క‌టిస్తుంటారు.

పండగ రోజులను అందరూ పర్వదినాలుగా భావిస్తారు. ఆయా రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే మంచి జరుగుతుందని నమ్ముతారు. అందుకే కొత్త బట్టల దగ్గర నుంచి ఖరీదైన ఇల్లు లేదా కారు వంటివి పండగ సీజన్లో కొనడానికే మొగ్గు చూపిస్తారు. పండగలు అటు భావోద్వేగాలు, ఇటు సెంటమెంటల్ అప్పీల్ కలిగి ఉండటంతో వీటిని జనం అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ సమయంలోనే కీలకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక పండగ సమయంలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఓ ఆర్థిక లావాదేవీనే కాదు… భవిష్యత్తుకు, ఆర్థిక భద్రతకు భరోసానిచ్చే అంశం.

పైగా పండగ వేళ ఆకర్షణీయమైన ఆఫర్లు, రాయితీతో కూడిన వడ్డీ రేట్లు, ఇతరత్రా ప్రోత్సాహకాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. దీంతో అటు డెవలపర్లు, ఇటు మార్కెట్ దారులు సాధ్యమైనంత మేర ఆఫర్లు, రాయితీలు ప్రకటించి కొనుగోలుదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. డౌన్ పేమెంట్లు తగ్గించడం, ప్రత్యేకమైన ఫైనాన్స్ ఆప్షన్లు ఇవ్వడం, విలువ ఆధారిత సౌకర్యాలు కల్పించడం, కాంప్లిమెంటరీ ఫర్నిషింగ్ ఇవ్వడం వంటివి కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్షిస్తాయి. మిగిలిన సమయాల్లో తాము పెట్టే డబ్బు కంటే కాస్త తక్కువ సొమ్ము పెట్టే అవకాశం పండగ వేళల్లో లభిస్తుంది. పైగా కాంప్లిమెంటరీ రూపేణా మరికొన్ని ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. దీంతో జనం పండగ వేళల్లో కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు.

ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాలతో ఊరూ వాడా హోరెత్తుతోంది. దీంతో అటు మార్కెట్ కు కళ వచ్చేసింది. ఏటా పండగ సీజన్లో ఉన్నట్టుగానే ఈ సారి కూడా ప్రాపర్టీ కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుందని రియల్టర్లు భావిస్తున్నారు. ఈ పండగ సీజన్ కళకళలాడటం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు.

This website uses cookies.