విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (వీఎంఆర్డీఏ) విజయనగరం జిల్లాలో ప్రతిపాదించిన లేఔట్ కు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతి లభించింది. విజయనగరం జిల్లాలోని రెండు వేర్వేరు మండలాల్లో మధ్యస్థ ఆదాయ వర్గాల (ఎంఐజీ) వారి కోసం 41 ఎకరాల్లో వీఎంఆర్డీఏ లేఔట్లను అభివృద్ధి చేస్తోంది. తాజాగా వీటికి అనుమతి లభించింది.
మరోవైపు విశాఖ జిల్లాలని 363 ఎకరాల్లో మరో రెండు లేఔట్లకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా డీటీసీపీకి పంపించింది. వీటిలో ఒక లేఔట్ 269.3 ఎకరాల్లో జీఎస్ అగ్రహారం, రామవరం గ్రామాల్లో రానుండగా.. పలవలసలోని 93.8 ఎకరాల్లో మరో లౌఔట్ రాబోతోంది. ఈ లేఔట్లలోని ప్లాట్ల ధరలు ల్యాండ్ పూలింగ్, లేఔట్ డెవలప్ మెంట్, మౌలిక వసతుల కల్పనకు అయ్యే వ్యయాల ఆధారంగా నిర్ధారిస్తామని వీఎంఆర్డీఏ అధికారులు వెల్లడించారు.
జగనన్న స్మార్ట్ టౌన్స్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఎంఐజీ ప్లాట్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి డిమాండ్ సర్వే నిర్వహించగా.. ఇప్పటివరకు 3.9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కాగా, విజయనగరం జిల్లాలో లేఔట్లకు డీటీసీపీ అనుమతి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే భూమిని చదును చేసి, మౌలిక వసతులు కల్పించడానికి టెండర్లు పిలుస్తామని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఎంఐజీ ప్లాట్లను మార్కెట్ రేటు కంటే తక్కువకే ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకం కింద రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య వార్షికాదాయం కలిగిన కుటుంబాలు ఒక ప్లాట్ పొందడానికి అర్హులు.