Categories: TOP STORIES

జీవో 69ని ర‌ద్దు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు విన‌తి

గ‌వ‌ర్న‌ర్ పేరిట త‌ప్పుడు స‌మాచారంతో విడుద‌ల చేసిన 69 జీవోను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు గ‌వ‌ర్న‌ర్ డా.త‌మిళ‌సైకి ఫిర్యాదు చేశారు. సోమ‌వారం విక్కీ రాష్ట్ర అధ్య‌క్షురాలు డా.లుబ్నా స‌ర్వ‌త్ ఆధ్వ‌ర్యంలో ప‌లువురు ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఒక విన‌తి ప‌త్రాన్ని అంద‌జేశారు. శాస్త్రీయ మ‌రియు నిపుణుల నివేదిక లేకుండా 69 జీవో అమ‌లు హానిక‌ర‌మ‌ని.. ఇది అమ‌లైతే హైద‌రాబాద్ న‌గ‌రానికి విప‌త్తుగా మారుతోంద‌ని గ‌వ‌ర్న‌ర్‌కి వివ‌రించారు. 1908లో హైద‌రాబాద్‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల నివార‌ణ కోస‌మే జంట‌జ‌లాశ‌యాల్ని అప్ప‌టి పాల‌కులు నిర్మించార‌ని తెలియ‌జేశారు. 2022 జూలైలో భ‌ద్రాచ‌లం వ‌ద్ద భారీ వ‌ర్షాల కార‌ణంగా అన్నారం, మేడిగ‌డ్డ వ‌ద్ద 29 కాళేశ్వ‌రం పంపులు మునిగిపోయాయ‌ని.. ఈ అనిశ్చితి నేప‌థ్యంలో తాగునీటి కోసం జంట జ‌లాశ‌యాల‌పై ఆధార‌పడాల్సి ఉంటుంద‌ని గుర్తు చేశారు. 2022 ఏప్రిల్ 12 దాకా జంట జ‌లాశయాలు గ్రావిటీ ద్వారా 11352 గ్యాల‌న్ల నీటిని స‌ర‌ఫ‌రా చేశార‌ని తెలిపారు. మ‌రి, ఈ ఫిర్యాదుపై గ‌వ‌ర్న‌ర్ ఎలా స్పందిస్తారో తెలియాలంటే మ‌రికొంత స‌మయం వేచి చూడాల్సిందే.

This website uses cookies.