భూమిపైనే కాదు.. రియల్ ఎస్టేట్ కు ఇతర గ్రహాలపై కూడా డిమాండ్ ఎక్కువే. ఇప్పటికే చంద్రుడిపైనా, అంగారకుడిపైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మేశారు. చాలామంది అంతే పిచ్చిగా కొనేసి, ఆ సర్టిఫికెట్లు తమ దగ్గర భద్రంగా దాచుకున్నారు. తాజాగా ఇదే కోవలో ఓ చర్చి పాస్టర్ స్వర్గంలో భూములు అమ్మకానికి ఉన్నాయంటూ ఆన్ లైన్ లో ప్రకటన ఇచ్చారు. దీనికి చాలామంది ఆకర్షితులయ్యారు కూడా. ఇప్పటికే ఈ రూపేణా ఆ చర్చి పాస్టర్ మిలియన్ల కొద్దీ డాలర్లు పోగేసుకున్నారు.
స్పెయిన్ కు చెందిన ఓ చర్చి పాస్టర్.. స్వర్గంలో భూములు అమ్మకానికి ఉన్నాయని.. చదరపు మీటర్ కేవలం వంద డాలర్లకే విక్రయిస్తున్నామని చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ అమ్మకాలకు సంబంధించి దేవుడి అనుమతి కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. 2017లో దేవుడు తనకు కలలో కనిపించినప్పుడు.. ఈ ప్రతిపాదన ఆయన ముందు ఉంచితే.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. అందువల్ల స్వర్గంలో భూములు కొనుక్కుంటే సాక్షాత్తూ దేవుడి ఇంటి పక్కనే ఉండే అవకాశం లభిస్తుందని ప్రకటనలు గుప్పించారు. ఆ మేరకు ఆన్ లైన్ లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా బ్రోచర్లు సైతం ప్రింట్ చేసి పంచిపెట్టడం ప్రారంభించారు. ఆ బ్రోచర్ లో మేఘాల మధ్యలో ఓ విల్లా.. అందులోకి ఓ కుటుంబం వెళుతున్నట్టు బొమ్మ వేశారు. దేవుని చెంతనే మీ ఇళ్లు.. ఇందుకు మాదీ గ్యారంటీ అంటూ చెల్లింపుల కోసం చాలా ఆప్షన్లు కూడా ఇచ్చారు. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు గూగుల్ పే వంటి యూపీఐ పేమెంట్ సదుపాయం కూడా ఉందని చెప్పారు.
ఇది ఎంతవరకు నిజం అనే సంగతి చాలామంది ఆలోచించలేదు. చాలామంది ఎగబడి స్వర్గంలో భూముల కోసం చెల్లింపులు చేసేశారు. కాగా, గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఉగాండాలో యూనివర్సల్ అపోస్తోల్ చర్చి పాస్టర్ ఫ్రెడ్ ఇసాంగా కూడా స్వర్గంలో భూములు అమ్ముతామంటూ ప్రకటనలు ఇచ్చారు. దీంతో అది నిజమేననుకుని చాలామంది తమ జంతువులు, భూములు అమ్ముకుని మరీ స్వర్గంలో భూములు కొనుక్కున్నారు.
This website uses cookies.