టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు వేర్వేరుగా లీగల్ నోటీసులు పంపించారు. నిర్ణీత గడువులోగా అపార్ట్ మెంట్ అప్పగించకపోవడంతోపాటు నాణ్యత లేని అపార్ట్ మెంట్ నిర్మించి ఇచ్చారని రెండు సంస్థలకు నోటీసులు పంపించిన యువీ.. నిర్మాణ ప్రాజెక్టుల ప్రచారంలో తన గోప్యతా హక్కులు ఉల్లంఘించారని మరో సంస్థకు నోటీసిచ్చారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన రిజ్వాన్ లా అసోసియేట్స్ సంస్థ యువరాజ్ తరఫున ఆ నోటీసులు పంపించింది.
ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి నిర్ణీత గడువులోగా ఫ్లాట్ అప్పగించలేదని, ఆ జాప్యానికి, గడువు పొడిగింపునకు సహేతుక కారణాలు కూడా వెల్లడించలేదని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన క్లైంట్ ప్రీమియం క్వాలిటీ అపార్ట్ మెంట్ బుక్ చేసుకున్నారని.. కానీ నాసిరకం, నాణ్యత లేని అపార్ట్ మెంట్ ఎందుకు ఇచ్చారో చెప్పాలని కోరారు. బ్రిలియంట్ ఎటోయిల్ ప్రైవేట్ లిమిటెడ్, ఉప్పల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఢిల్లీలోని హౌజ్ ఖాస్ లో చేపట్టిన ప్రాజెక్టులో 2020లో యువీ ఓ యూనిట్ బుక్ చేసుకున్నారు. అయితే, దీని అప్పగింతలో జాప్యం జరిగింది.
అలాగే ప్రచార ప్రకటనకు సంబంధించి తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించిందని పేర్కొంటూ బ్రిలియంట్ ఎటోయిల్ ప్రైవేట్ లిమిటెడ్ కు యువరాజ్ మరో నోటీసు పంపించారు. ఆ సంస్థలో ప్రచారానికి సంబంధించిన ఒప్పందం నవంబర్ 23, 2023తో ముగిసిందని, అయినప్పటికీ ఆ సంస్థ ఇంకా తన పేరును, ఫొటోలను సోషల్ మీడియాలో వినియోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇలా చేయడం ప్రముఖుల బ్రాండ్ విలువను దుర్వినియోగం చేయడంతోపాటు వ్యక్తిగత హక్కులు, కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు.
This website uses cookies.