కొందరు యూడీఎస్, ప్రీలాంచ్ అక్రమార్కులు.. కోకాపేట్, కొల్లూరులో ప్రాజెక్టుల్ని ఆరంభించారు.. రేటు తక్కువంటూ అమ్మేశారు. ఇక మిగిలింది వాటికి అనుమతుల్ని తెచ్చి నిర్మాణ పనుల్ని ఆరంభించడమే. కానీ, అది ఎప్పుడు ఆరంభిస్తారో సాక్షాత్తు అమ్మిన వారికే తెలియదు. అందులో కొన్నవారికీ అసలే అర్థం కాదు. వీరికి పూర్తిగా కనువిప్పు కలిగేందుకు కనీసం ఒకట్రెండేళ్లు అయినా పడుతుందనే విషయంలో సందేహం లేదు.
కానీ, ఈలోపు ఖాళీగా కూర్చోవడం ఎందుకు దండగ అనుకున్నారీ యూడీఎస్, ప్రీలాంచ్ అక్రమార్కులు. ఏమాత్రం ఆలోచించకుండా ఎంచక్కా పటాన్‌చెరు వైపు దృష్టి సారించారు. రేటు తక్కువంటే చాలు.. ఇక్కడి సామాన్య, మధ్యతరగతి అమాయక జనాలు కొంటారనే ఆలోచనతో.. ప్రీలాంచ్ స్కీములతో సరికొత్త స్కాములకు స్కెచ్ వేశారు.
పటాన్‌చెరు, ముత్తంగి, రుద్రారం, ఇస్నాపూర్ వంటి ప్రాంతాల్లో పలు రియాల్టీ సంస్థలు యూడీఎస్, ప్రీలాంచ్ మోసాలకు తెరలేపాయి. ఇప్పుడు కొంటే రేటు తక్కువ.. భవిష్యత్తులో అయితే ధర పెరుగుతుందని చెబుతూ ప్రజలు చెవిలో పూవులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తమ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ అనే ఒక సంస్థ.. పటాన్‌చెరులోని ఇస్నాపూర్లో.. ఏకంగా 1200 ఫ్లాట్లను నిర్మిస్తామంటూ.. ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రకటనలూ పలు రియల్ ఎస్టేట్ పోర్టళ్లలో దర్శనమిస్తున్నాయి.
రెరా అనుమతి తీసుకోకుండా కనీసం బ్రోచర్ కూడా విడుదల చేయవద్దని అధికారులు అంటుంటే.. ఇలాంటి సంస్థలు ఏమాత్రం పట్టించుకోకుండా.. ప్రీలాంచులో ఫ్లాట్లను విక్రయిస్తున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. తమ అనుమతి లేకుండా ఇంత నిర్లజ్జాగా ఫ్లాట్లను అమ్ముతున్న సంస్థల్ని నిరోధించాల్సిన బాధ్యత రెరా అథారిటీపై లేదా? మరి, ఇలాంటి నీతిమాలిన సంస్థల్ని దారిలోకి తేకుండా.. రెరా అథారిటీ నిద్రపోతుందా? ఇలా ప్రతిఒక్క సంస్థ ప్రీలాంచ్, యూడీఎస్‌లో ఫ్లాట్లను యధేచ్చగా విక్రయిస్తుంటే.. రెరా వద్ద అనుమతులు తీసుకోవడమెందుకు?
ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించే డెవలపర్ల మాటల్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు. ఎందుకంటే, వారికి ప్రాజెక్టు మీద ప్రేమ ఉంటే.. ఇలా మోసపూరిత ధోరణిలో ప్రాజెక్టుల్ని నిర్మించరు. ఎందుకంటే, అపార్టుమెంట్ అంటే అలా ప్లాటు అమ్మేసి వదిలేసిట్లు కాదు. ఈ విషయం అర్థంకాక అనేక మంది రియల్టర్లు ప్లాట్లను అమ్మినంత సులువుగా ఫ్లాట్లను విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. రేటు తక్కువ కాబట్టి, వెనకా ముందు ఆలోచించకుండా ప్రజలు వాటిని కొనేస్తున్నారు. రెరా అనుమతి లేని ప్రాజెక్టులో ఫ్లాట్లు కొంటే.. అతను మధ్యలో వదిలేస్తే అంతే సంగతులు.
అందులో కొన్నవారికీ సాయం చేయడానికి ప్రభుత్వమూ ముందుకు రాదు. చివరికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందులో యూడీఎస్లో ఫ్లాట్లను కొన్నవారి పరిస్థితి అయితే మరింత దారుణంగా మారుతుంది. ఎందుకంటే, వారంతా ఆయా ప్రాజెక్టులో కొనుగోలుదారులు కాకుండా సహయజమానులుగా మారుతారు. ఒకవేళ, ప్రధాన నిందితుడు ప్రాజెక్టును మధ్యలో వదిలేసి పరారైతే.. వీరి మీదికి మిగతా కొనుగోలుదారులు వచ్చి పడతారు. ఇలాంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని.. యూడీఎస్, ప్రీలాంచుల్లో ఫ్లాట్లను కొనడం కరెక్టు కాదు.
తెలంగాణ రెరా అథారిటీ అనుమతి తీసుకోకుండా.. పలు సంస్థలు హండ్రెడ్ పర్సెంట్ స్కీములో.. ఒక్కో ఫ్లాటును చదరపు అడుక్కీ రూ.2,200 చొప్పున విక్రయిస్తున్నాయి. పైగా, అమెనిటీస్ కోసం ఎలాంటి ఛార్జీలు లేవని ప్రచారం చేస్తున్నారు. ముందుగా యాభై శాతం సొమ్ము చెల్లిస్తే.. చదరపు అడుక్కీ రూ.2900కే ఫ్లాట్లను అమ్ముతారట. ఇలాంటి మోసపూరిత ప్రకటనల మాయలో పడిపోయి.. మీ కష్టార్జితాన్ని ఇందులో పోసి బూడిదపాలు చేసుకోకండి. కేవలం స్థలయజమానితో అంగీకారం కుదుర్చుకుని.. ఇలా ఫ్లాట్లను అమ్మకానికి పెట్టిన పలు ప్రాజెక్టులకు నేటికీ అనుమతులు రాలేవు. అమీన్‌పూర్‌లో సాహితీ సంస్థకు ఐదేళ్లయినా నేటికీ అనుమతి రాలేదు. అందులో ఫ్లాట్లు కొన్నవారంతా సంస్థ చుట్టూ నేటికీ తిరుగుతున్నారు. కాబట్టి, మీరూ ఇస్నాపూర్‌లో యూడీఎస్, ప్రీలాంచుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసి.. అలాంటి ఇబ్బందులు పడకూడదంటే.. కేవలం రెరా అనుమతి గల అపార్టుమెంట్లలో మాత్రమే ఫ్లాట్లు కొనండి. మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. రెరా ప్రాజెక్టుల్లో కొంటే.. ఫ్లాట్లను అందజేసిన నాటి నుంచి ఐదేళ్ల దాకా స్ట్రక్చర్‌లో ఎలాంటి లోపాలున్నా డెవలపరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆలోపు ఎలాంటి సమస్యలొచ్చినా డెవలపరే పరిష్కరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఇందులో కొన్నవారు నిశ్చింతంగా ఉండొచ్చు.
This website uses cookies.