అనుమతుల్లేని లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేస్తే.. ఎల్ఆర్ఎస్ చేసుకుని ఆ ప్లాట్లను సక్రమం చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం జీహెచ్ఎంసీతో పాటు స్థానిక పట్టణ సంస్థలు ఆ లేఅవుటు ఉన్న ప్రాంతాన్ని బట్టి రుసుముల్ని వసూలు చేస్తుంది. ప్లాటు రేటు కంటే కాస్త ఎక్కువే ఈ రుసుము ఉంటుంది. ఇలా అధిక రుసుములు ఉంటే, అక్రమ లేఅవుట్లలో కొనుగోలుదారులు ప్లాట్లను కొనకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం అనుకుంటా. అదే విధంగా, నిర్మాణాలు అక్రమంగా చేపడితే వాటినీ క్రమబద్ధీకరించడానికి గతంలో బీపీఎస్ స్కీమును ప్రవేశపెట్టారు. కాకపోతే, కోర్టులో కేసు ఉండటం వల్ల ఆ పథకం అమల్లో లేదు. అక్రమ నిర్మాణాల్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ మళ్లీ ప్రారంభం కాలేదు.
ఇళ్ల కొనుగోలుదారులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో.. కేంద్రం రెరా అథారిటీకి పచ్చజెండా ఊపింది. ఈ చట్టాన్ని 2018లో తెలంగాణ ప్రభుత్వమూ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్నుంచి తెలంగాణకు చెందిన అనేకమంది బిల్డర్లు, డెవలపర్లు రెరాలో నమోదు చేసుకున్నారు. ఒక పద్ధతిగా నిర్మాణాల్ని చేపట్టడం ఆరంభించారు. కాకపోతే, గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ రెరాను బురిడీ కొట్టించి.. రెరా నిబంధనలకు తూట్లు పొడిచి.. అక్రమ రీతిలో ప్లాట్లు, ఫ్లాట్లను కొందరు అక్రమార్కులకు అమ్మడం ఆరంభించారు. దీని వల్ల అమాయక కొనుగోలుదారులు మోసపోతున్నారు. ఇలాంటి ప్రీలాంచ్, యూడీఎస్ అమ్మకాల వల్ల రియల్ రంగం గాడి తప్పుతోందని ఎంత మొత్తుకుంటున్నా.. తెలంగాణ రెరా అథారిటీ స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అసలే పట్టించుకోవట్లేదు. ఈ అంశమై ఇటీవల ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ గవర్నర్‌కి లేఖ కూడా రాసింది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి రెరా అథారిటీ.. రెరా ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేస్తే.. కొనుగోలుదారులకు రక్షణ కల్పించవచ్చని గవర్నర్‌కి విన్నవించింది. మరి, ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియాలంటే కొంత సమయం పడుతుంది.
* ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీలాంచ్, యూడీఎస్ పేరిట తక్కువ రేటుకే ప్లాట్లు, ఫ్లాట్లను అమ్ముతున్నారు. రెరా అనుమతి లేకుండా విచ్చలవిడిగా అతి తక్కువ రేటుకే ఫ్లాటంటూ చెలరేగిపోతున్నారు. మరి, ఇలాంటి వెంచర్లను, ప్రాజెక్టులను రెరా పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు? అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలన్నీ సక్రమం చేసేయవచ్చు కదా. ఇందుకోసం ప్రభుత్వం రెరా పీనలైజేషన్ స్కీమ్ (ఆర్‌పీఎస్) అని పేరు పెడితే, అందులో కొన్నవారంతా రెరా పరిధిలోకి వస్తారు. ఆయా ప్రాజెక్టుల్లో కొన్నవారంతా రెరా నుంచి తగిన రక్షణ పొందగల్గుతారు. తెలంగాణలో పెట్రేగిపోతున్న అక్రమ వెంచర్లకు చరమగీతం పాడినట్లు ఉంటుంది.
This website uses cookies.