ట్రిపుల్ వన్ జీవో, యూడీఎస్, ప్రీలాంచ్, కన్జర్వేషన్ జోన్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ.. కొందరు రియల్టర్లు ప్రీలాంచుల్లో.. ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్ని విక్రయిస్తున్నారు. కేవలం రేటు తక్కువనే ఏకైక కారణంతో.. మీరు అందులో కొనుగోలు చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడే అవకాశముంది. కాబట్టి, ఇలాంటి వాటిలో కొని మీరు మోసపోకూడదంటే.. ప్రభుత్వ నిబంధనల్ని మీరు తెలుసుకోవాలి. ఆతర్వాతే మీరు మీ పెట్టుబడికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలి.
ఢిల్లీలోని నొయిడా, గుర్గావ్‌లో బడా బడా బిల్డర్లు సైతం ప్రీ సేల్స్ అంటూ అమాయక ప్రజల్ని దారుణంగా మోసగించారు. తమ కష్టార్జితాన్ని అందులో పోసినవారిలో అధిక శాతం మంది నేటికీ సొంతింట్లోకి అడుగు పెట్టలేకపోయారు. పది, పదిహేనేళ్లు దాటుతున్నా నేటికీ కొందరు కొనుగోలుదారులు ఆయా సంస్థలపై కోర్టుల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాంటి అక్రమ అమ్మకాల్ని నిరోధించడానికే గత కాంగ్రెస్ ప్రభుత్వం రెరా చట్టానికి రూపకల్పన చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ రెరా చట్టం ప్రకారం.. 500 గజాల కంటే అధిక విస్తీర్ణంలో.. ఎనిమిది కంటే అధిక ఫ్లాట్లను నిర్మించే ఏ బిల్డర్ అయినా స్థానిక సంస్థతో పాటు రెరా అనుమతి తీసుకోవాల్సిందే. కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు.. ఇలా ఎక్కడ అపార్టుమెంట్లను కట్టినా లేఅవుట్లు వేసినా వ్యక్తిగత గృహాల్ని నిర్మించినా లేదా విల్లాల్ని కట్టినా.. రెరా అనుమతి తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే, ఆయా నిర్మాణం అక్రమ నిర్మాణంగా పరిగణించబడుతుంది.
రెరా ఉంటేనే ముందడుగు..
రెరా పర్మిషన్ లేకుండా అపార్టుమెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాల్ని నిర్మిస్తే.. ఆయా బిల్డర్‌కు రెరా నోటీసును జారీ చేస్తుంది. అతని నుంచి సరైన సమాధానం రాకపోతే, ఆయా ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను లెక్కిస్తుంది. ఆయా బిల్డర్‌కు జైలుశిక్ష కూడా విధిస్తుందని గుర్తుంచుకోండి. అయితే, 2016-17 నుంచి కొందరు బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. రెరా అథారిటీ నుంచి అనుమతి తీసుకోకుండా.. యూడీఎస్, ప్రీలాంచుల్లో ఫ్లాట్లు, విల్లాల్ని విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకే సొంతిల్లు కొనుక్కోండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహిస్తూ అమాయకుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇలాంటి డెవలపర్ల మాయమాటలో పడి.. మీరు వంద శాతం సొమ్ము తీసుకెళ్లి.. ఆ డెవలపర్ల చేతిలో పోస్తే అంతే సంగతులు.. మీ కష్టార్జితం కాస్త బూడిదపాలు అవుతుంది. అందుకే, రెరా పర్మిషన్ లేని ట్రిపుల్ వన్ జీవోలో కానీ కన్జర్వేషన్ జోన్‌లో కానీ ఎట్టి పరిస్థితిలో ఫ్లాటు, విల్లాల్ని కొనుగోలు చేయకండి. అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోకండి.
ఇలా చేస్తే మోసమే!
కొందరు బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. ఇంటర్నెట్ నుంచి అందమైన బిల్డింగ్స్, ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్ ఫోటోలు, వీడియోలను డౌన్ లోడ్ చేసి ప్రజలకు పంపిస్తున్నారు. అంటే, తాము కట్టే నిర్మాణం కూడా అదే విధంగా ఉంటుందనే విషయాన్ని పరోక్షంగా చూపిస్తూ.. ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అది నిజమేనని నమ్మి, కొందరు ప్రజలు అందులో వంద శాతం సొమ్ము పోస్తున్నారు. ఆతర్వాత అది మోసపూరిత ప్రాజెక్టు అని తెలిసి లబోదిబోమంటున్నారు. కాబట్టి, మీరు మోసపోయిన వారి జాబితాలో చేరకూడదంటే.. కేవలం రెరా అనుమతి గల ప్రాజెక్టుల్ని మాత్రమే ఎంచుకోవాలని రియల్ ఎస్టేట్ గురు కోరుతోంది.
This website uses cookies.