Categories: LATEST UPDATES

ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మిస్.. ఐసీఐసీఐ బ్యాంకు మీద ఫైన్!

ఓ జంటకు చెందిన ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోగొట్టినందుకు ఐసీఐసీఐ బ్యాంకుకు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఆ జంటకు నష్టపరిహారం కింద రూ.55 వేలు చెల్లించాలని ఆదేశించింది. వివ‌రాల్లోకి వెళితే..

జోధ్ పూర్ ప్రాంతానికి చెందిన హిమాన్షి బెన్, చైతన్య సోని దంపతులకు ఉమియా విజయ్ సొసైటీలో ఓ ఇల్లు ఉంది. 2005 ఫిబ్రవరిలో రుణం తీసుకున్న సమయంలో ఆ ఇంటికి సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్, ఇతర పత్రాలను బ్యాంకుకు సమర్పించారు. 2011 నవంబర్ లో రుణం మొత్తం తిరిగి చెల్లించి, తమ ఇంటి పత్రాలు ఇవ్వాలని కోరారు. కానీ బ్యాంకు అధికారులు వాటిని తిరిగి ఇవ్వలేదు. వాస్తవానికి అవి 2005 ఏప్రిల్ లోనే బ్యాంకు లాయర్ ఆఫీసు నుంచి చోరీకి గురయ్యాయి. అయితే, ఆ విషయాన్ని బ్యాంకు అధికారులు దాచి పెట్టారు.

తమ పత్రాల కోసం ఆ భార్యాభర్తలు తిరుగుతుండటంతో చివరకు 2014లో అసలు విషయాన్ని వెల్లడించారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీంతో బ్యాంకుపై అహ్మదాబాద్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ లో ఫిర్యాదు చేశారు. తమ ప్రాపర్టీ పత్రాలను పోగొట్టడమే కాకుండా ఆ విషయాన్ని దాచి పెట్టారని పేర్కొన్నారు. వాదనలు విన్న కమిషన్.. బ్యాంకు తీరును తప్పబట్టింది. తనఖా పెట్టుకున్న ఆస్తి పత్రాలను భదరపరచడం బ్యాంకు విధి అని స్పష్టం చేసింది. 11 ఏళ్లుగా ఆ పత్రాలు ఇవ్వకుండా ఉండటం సబబు కాదని పేర్కొంది. ఎనిమిది రోజుల్లో వాటిని ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వాలని లేదా కొత్త సేల్ డీడ్ తయారు చేయించి, దానిని రిజిస్టర్ చేసి నెల రోజుల్లో ఇవ్వాలని ఆదేశించింది. అంతే కాకుండా నష్టపరిహారం కింద రూ. 55వేలు చెల్లించాలని స్పష్టం చేసింది.

This website uses cookies.