కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తోపాటు క్యూఆర్ కోడ్ కేటాయించనున్నట్టు మహారాష్ట్ర రెరా ప్రకటించింది. ఇల్లు కొనాలనుకునేవారికి అన్ని అంశాలనూ సులభంగా పరిశీలించుకునేందుకు వెసులుబాటు కల్పించడమే దీని లక్ష్యమని పేర్కొంది. ఒకే ఒక్క క్లిక్ తో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అంతా కొనుగోలుదారుకు అందుబాటులో ఉంటుందని వివరించింది. ఇటీవలే క్యూఆర్ కోడ్ తోపాటు కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను పుణెలోని ఓ డెవలపర్ కు జారీ చేసినట్టు తెలిపింది.
ఇల్లు కొనాలనుకునేవారు తమ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దీంతో ఆ ప్రాజెక్టు పేరు, డెవలపర్ పేరు, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది వంటి నిర్దిష్ట సమాచారం పొందవచ్చు. సదరు ప్రాజెక్టుపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోవచ్చు. అనుమతి పొందిన ప్లాన్ లో ఏమైనా మార్పులు చేశారా? ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ పునరుద్ధరించారా అనే సమాచారం కూడా ఒకే ఒక్క క్లిక్ తో అందుబాటులో ఉంటుంది. కాగా, మహా రెరా ప్రారంభమైన 2017 మే నుంచి ఇప్పటివరకు దాదాపు 40 వేల ప్రాజెక్టులు ఇందులో నమోదయ్యాయి. వీటిలో 5700 ప్రాజెక్టులు ఆగిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి
This website uses cookies.