రెరాలో నమోదు చేసే ప్రతి ప్రాజెక్టుకూ ఓ క్యూఆర్ కోడ్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ రెరా నిర్ణయించింది. కొత్త ప్రాజెక్టులతోపాటు సరైన రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి ప్రాజెక్టుకూ ఈ కోడ్ ఇవ్వనుంది.
కొనుగోలుదారులు ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సదరు ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త వివరాలను రెరా వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. ఇందుకోసం ప్రమోటర్లు తమ బ్రౌచర్లు, ప్రకటనలతో ఈ క్యూఆర్ కోడ్ తప్పనసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. ‘కొనుగోలుదారులు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతోపాటు ప్రమోటర్ కు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం కోసం ప్రతి ప్రాజెక్టుకూ మేం ఓ క్యూఆర్ కోడ్ ఇస్తాం. దీనిని ప్రమోటర్లు తమ ప్రమోషన్లు, ప్రకటనలు, ఇతరత్రా అన్ని డాక్యుమెంట్లపై తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది’ అని యూపీ రెరా చైర్మన్ సంజయ్ భూసిరెడ్డి పేర్కొన్నారు.
కొనుగోలుదారులకు అందించే బుకింగ్ ఫారాలు, అలాట్ మెంట్ లెటర్లు, బీబీఏలు, ఇతరత్రా అన్ని ప్రకటనలపైనా దీనిని తప్పనిసరిగా ముద్రించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని భూమి పత్రాలు, అనుమతి పొందిన లేఔట్లు, మ్యాప్స్, ప్రాజెక్టు స్పెసిఫికేషన్స్, వసతులు, ప్రాజెక్టుల ప్రారంభ, పూర్తయ్యే తేదీలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ప్రమోటర్లు, కో ప్రమోటర్లు, రిజిస్టర్డ్ ఏజెంట్లు, త్రైమాసిక పురోగతి నివేదికలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, కంప్లీషన్ సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల వంటి వివరాలన్నీ పొందవచ్చని వివరించారు.
This website uses cookies.