తెలంగాణ రాష్ట్రంలో రెరా అథారిటీ ఏర్పాటైనా కొన్ని రియల్ సంస్థలు పెద్దగా పట్టించుకోవట్లేదు. రెరా అనుమతి లేకుండా ప్రీలాంచుల్లో ఫ్లాట్లు అమ్మకూడదని.. సోషల్ మీడియాలో ప్రకటనల్ని విడుదల చేయకూడదని సాక్షాత్తు రెరా ఛైర్మన్ చెబుతున్నప్పటికీ పలు రియల్ సంస్థలు బేఖాతరు చేస్తున్నాయి. ఇంతవరకూ రెరా అథారిటీ ఏ సంస్థ మీద కూడా కొరడా ఝళిపించలేదు. జరిమానా కూడా విధించలేదు. అందుకే, కొన్ని నిర్మాణ సంస్థలు ప్రీలాంచ్ దందాను మూడూ పూవులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో రాధే గ్రూప్ అనే సంస్థ ఉస్మాన్ నగర్‌లో రాధే పనోరమా అనే ప్రాజెక్టును ప్రీలాంచ్‌లో అమ్మకానికి పెట్టింది. ఇందుకు సంబంధించిన బ్రోచర్, ఆకర్షణీయమైన ఆఫర్ ధరలను కొనుగోలుదారులకు పంపిస్తోంది.
తెల్లాపూర్ చేరువలోని ఉస్మాన్ నగర్‌లో సుమారు ఇరవై ఎకరాల్లో.. జి ప్లస్ పదమూడు టవర్లను రాధే పనోరమాలో నిర్మిస్తామని సంస్థ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య సుమారు మూడు వేల దాకా ఉన్నాయి. అపర్ణా సైబర్ హైట్స్ పక్కనే ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని సంస్థ ప్రచారం చేస్తోంది. ఈ సంస్థ ఆఫర్ చూస్తే ఎవరికైనా ఆకర్షితులు కావాల్సిందే. అసలు ప్రాజెక్టును నిర్మిస్తారో లేదో తెలియదు కానీ ఇంటర్నెట్ నుంచి విదేశీ నగరాల ఫోటోలను తీసుకుని మధ్యతరగతి ప్రజానీకానికి బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది.
రాధే పనోరమా అనే ప్రాజెక్టులో ప్రీలాంచ్ ఆఫర్‌ను రెండు టవర్లకు ప్రకటించింది. వీటిలో మొదటి యాభై ఫ్లాట్లను బుక్ చేసేవారికి చదరపు అడుక్కీ రూ.4200కే అందజేస్తామని ఆఫర్‌ను ప్రకటించింది. పది అంతస్తుల్లోపు ఫ్లాట్లను బుక్ చేసుకునేవారికే ఈ అవకాశమట. ఆతర్వాతి అంతస్తుల్లో కావాలని కోరుకునేవారు.. చదరపు అడుక్కీ ఇరవై రూపాయలు చొప్పున ఫ్లోర్ రైజ్ ఛార్జీలను కట్టాలట. అదే 51 నుంచి 100 ఫ్లాట్ల లోపు బుకింగ్ చేసేవారికైతే చదరపు అడుక్కీ రూ.4400 చొప్పున విక్రయిస్తారట. ఈ సంస్థకు ఇప్పటివరకూ ఆకాశహర్మ్యాల్ని నిర్మించిన చరిత్ర లేదు. చేసింది రెండే రెండు విల్లా ప్రాజెక్టులు. స్కై అనే ప్రాజెక్టును సంస్థ వెబ్‌సైటులో కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేస్తే.. క్లౌడ్‌వుడ్ కన్‌స్ట్రక్షన్స్ అనే పేరు ఉంది. అంటే, ఇంతవరకూ ఒక్క బహుళ అంతస్తుల భవనం కూడా కట్టిన అనుభవం లేని రాధే గ్రూప్ సంస్థ.. ఏకంగా జి+32 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని ఆరంభించడం.. అందులో రెరా అనుమతి లేకుండా చదరపు అడుక్కీ రూ.4200కే విక్రయించడాన్ని చూస్తుంటే.. ఇదేదో స్కామ్ తరహా కనిపిస్తోంది. కాబట్టి, బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణంలో పెద్దగా అనుభవం లేని ఇలాంటి కంపెనీల వద్ద ప్రీలాంచ్‌లో కొనుగోలు చేసి.. అడ్డంగా మునిగిపోయే అవకాశం లేకపోలేదు. కాబట్టి, కొనుగోలుదారులు ఇలాంటి ప్రీలాంచ్ ప్రాజెక్టులకు దూరంగా ఉండటమే మంచిది.