హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో ఎకరం ధర రూ.41 కోట్లకే పరిమితం కావడంతో హైదరాబాద్ నిర్మాణ రంగం ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే, కోకాపేట్ రెండో విడత వేలంలో ఎకరం రేటు వంద కోట్లు పలికిన నేపథ్యంలో.. అందరి దృష్టి బుద్వేల్ మీద కేంద్రీకృతమైంది. ఇక్కడ ఎకరం ధర కనీసం అరవై నుంచి డెబ్బయ్ కోట్లు పలుకుతుందేమోనని తొలుత అంచనా వేశారు. కాకపోతే, కోర్టు కేసు ఉండటం, కొండలు మరియు గుట్టలుండటం, మౌలిక సదుపాయలు అభివృద్ధి చెందకపోవడం, ఎన్నికల సంవత్సరం కావడం వంటి కారణాల వల్ల నగరానికి చెందిన బడా బిల్డర్లు.. బుద్వేల్ వేలంలో పాల్గొనేందుకు విముఖత చూపెట్టారు. అధిక శాతం మంది కొత్తవారే ఈ వేలంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బుద్వేల్ వేలం పాటల నుంచి హెచ్ఎండీఏ కొంత నేర్చుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేలంలో ఎకరం ధర తక్కువ పలకడంతో.. ఎగువ మధ్యతరగతి ప్రజానీకానికి ఫ్లాట్ల ధరలు అందుబాటులోకి వచ్చే ఆస్కారముంది.
కోకాపేట్, మోకిలా వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటల్లో అధిక ధర పలికిన విషయం తెలిసిందే. దీంతో, తామేం చేసినా చెల్లుతుందనే రీతిలో హెచ్ఎండీఏ వ్యవహరించిందనే విమర్శలున్నాయి. బుద్వేల్లో వేలం పాటల్ని నిర్వహించే క్రమంలో.. అక్కడ ఎంత ఎత్తు వరకూ అపార్టుమెంట్లను నిర్మించవచ్చనే విషయంలో హెచ్ఎండీఏ బిడ్డర్లకు సకాలంలో సమాచారం అందించడంలో విఫలమైందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కోకాపేట్ తరహాలో బుద్వేల్‌లో ఆకాశహర్మ్యాల్ని కట్టలేమనే సమాచారం చివర్లో తెలుసుకున్న కొందరు బడా బిడ్డర్లు వేలంలో పాల్గొనలేదని తెలిసింది.
హెచ్ఎండీఏ నిర్వహించే వేలానికి ఆదరణ పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఒక ప్రైవేటు స్థలం కొనుక్కుని.. ప్రభుత్వ సంస్థల వద్దకెళ్లి ఎన్వోసీలు, అనుమతులు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడాలి. ఎంతలేదన్నా ఓ ముప్పయ్ ఎన్వోసీలను వరకూ తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ సర్వే చేయించడానికి సవాలక్ష సమస్యలుంటాయి. స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పర్సంటేజీలను ముట్ట చెప్పాలి. ఇవన్నీ ఏదో రకంగా మేనేజ్ చేసి.. హెచ్ఎండీఏ వద్దకు అనుమతికి వెళితే.. ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇవన్నీ ఎందుకని భావించేవారు ఎక్కువ ధర అయినా హెచ్ఎండీఏ భూముల్ని కొంటున్నారు. సమస్యల్ని సృష్టించే సంస్థనే పరిష్కారంగా మారడంతో చాలామంది కొంటున్నారు.
This website uses cookies.