బెంగళూరులో నీటి ఎద్దడిని చూసి ఒక్కసారిగా షాకయ్యాం. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద బకెట్ నీళ్లను రెండు వందలు పెట్టి కొన్న సందర్భాలున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఈసారి నీటి సమస్య తీవ్రంగానే ఏర్పడింది. ముందస్తుగా వర్షాలు పడి గట్టెక్కాం కానీ లేకపోతే.. ఇక్కడా నీళ్లు దొరక్క అవస్థ పడాల్సి వచ్చేది. అయితే, ఈ ప్రమాదం ఎప్పటికీ పొంచి ఉంటుంది కాబట్టి.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఇందుకోసం మన ముందున్న అవకాశాలేమిటి వంటి విషయాల్ని రెజ్ న్యూస్ పాఠకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ టి. విజయ్ కుమార్. మరి, ఆయన చెబుతున్న పలు ఆసక్తికరమైన అంశాలేమిటో ఆయన మాటల్లోనే..
మంచినీటి సంరక్షణ గురించి ప్రభుత్వాలు లేదా అధికారులు పని చేయడమే కాదు.. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. నీటిని సంరక్షిస్తేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణలో 45 నుంచి 60 రోజుల్లో సుమారు 900 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. అంటే, ఈ నీరంతా భూమి మీద నిల్వ ఉన్నట్లయితే.. మూడు ఫీట్ల లోతులో మనం ఉన్నట్లు లెక్క. అయితే, ఈ నీరు కురిసినట్లు కురిసి ఎక్కడికో ప్రవహిస్తూ వెళ్లిపోతుంది. ఈమధ్య కాలంలో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. 45 నుంచి 60 రోజుల్లో పడాల్సిన వర్షంలో సగం.. రెండు రోజుల్లోనే కురుస్తోంది. అదే వేసవి వస్తేనేమో నీటి ఎద్దడి పెరుగుతోంది. వర్షాకాలంలో అర్బన్ ఫ్లడింగ్ అధికమవుతోంది. ఇలాంటప్పుడు మనమేం చేయాలో తెలుసా? కురుస్తున్న వర్షాన్ని పైకప్పుల ద్వారా నిల్వ చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అలా నిల్వ చేసుకున్న వర్షం నీళ్లను మనం రోజువారీ కార్యక్రమాలకు ఎంతమేరకు వినియోగించాలనే అంశం గురించి తెలుసుకోవాలి. పది శాతమా.. ఇరవై శాతమా.. అనే అంశాన్ని పక్కన పెట్టేసి.. ఎంత అవకాశముంటే అంత నీటిని నిల్వ చేసుకోవాలి.
హైదరాబాద్‌లో సాధారణంగా 11, 12 మీటర్ల లోతులో బావులుంటాయనే విషయం తెలిసిందే. అక్కడి వరకూ వర్షపు నీరు రీచార్జ్ అయ్యే అవకాశముంది. వంద శాతం మంచి నీటి సంరక్షణ మీదే ఆధారపడకుండా.. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం సింటెక్స్ ట్యాంకులను వినియోగించుకోవచ్చు. కాస్త సొమ్ముంటే సంపును సిద్ధం చేసుకుని.. అందులోకి వర్షపు నీరు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ నీరును శుభ్రపరిచి మనం తాగునీటి నాణ్యతను తెచ్చుకోవచ్చు. అలా వద్దనుకుంటే, ఇంట్లో బట్టలు ఉతకడానికి, ఫ్లష్ చేయడానికి, కార్లు, బైకులు కడుక్కోవడానికి, గార్డెనింగ్ కోసం ఈ నీటిని సమర్థంగా వాడుకోవచ్చు. అదే అపార్టుమెంట్లలో అయితే గ్రీనరీని పెంచుకునేందుకు ఈ నీటిని వినియోగించుకోవచ్చు. వర్షం నీటిలోని ఇరవై శాతాన్ని గనక నిల్వ చేసుకుంటే, సుమారు ఆరు నెలల పాటు వాడొచ్చు. గరిష్ఠంగా ఏడాది దాకా వినియోగించుకోవచ్చు. ఈ నీళ్లు పాడైపోవడమంటూ ఉండదు. అయితే, ఆయా నీటిని దేనికోసం వాడాలనే అంశంలో అవగాహన ఉన్నట్లయితే, ఆ స్థాయిలో ఫిల్టరేషన్ చేసుకోవాలి. యాక్టివ్ కార్బన్, 20-40 ఎంఎం అగ్రిగేట్, ఇసుక వంటివాటితో కాలమ్స్ చేసి ఫిల్టరేషన్ చేసుకుంటే, ఇందులో పార్టికల్స్ రాకుండా చేసినట్లయితే.. దాదాపు ఆర్‌వో క్వాలిటీ నీరు మనకు లభించినట్లే. అల్ట్రా వైలెట్ ఫిల్టరేషన్ లేదా ఆక్వాగార్డ్ వంటిది కనెక్ట్ చేసుకున్నా మంచినీరును ఆనందంగా తాగొచ్చు. అయితే, మంచినీటిని నిల్వ చేసుకునే ప్రాంతంలో సూర్యరశ్మీ పడకూడదు.
వర్షపు నీటిని నిల్వ చేసుకునే ప్రక్రియను ఎవరైనా చేసుకోవచ్చు. అయితే, వర్షం నీటిని తాగునీటి అవసరాల కోసం చేయాలనుకుంటే మాత్రం నిపుణుల పర్యవేక్షణలో చేసుకుంటే మంచిది. ఇందుకోసం ఈపీటీఆర్ఐ వంటి సంస్థలను సంప్రదిస్తే తోడ్పాటును అందిస్తారు.
This website uses cookies.