Categories: Celebrity Homes

ఆధునిక ప్యాలెస్.. మెగాస్టార్ రెసిడెన్స్

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటన, డ్యాన్సులతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న చిరు.. తాజాగా వాల్తేరు వీరయ్యతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. మరి హైద‌రాబాద్‌లో ఆయ‌న ఇల్లు ఎలా ఉందో ఓసారి చూసొద్దామా?

జూబ్లీహిల్స్ లో చిరంజీవి నివసిస్తున్న ఇంటిని ఆధునిక కాలపు ప్యాలెస్ గా అభివర్ణించవచ్చు. అత్యంత విలాసవంతమైన ఈ ఇల్లు.. టాలీవుడ్ లోని అందరినీ ఆశ్చర్యపరిచింది. హెరిటేజ్ డిజైన్ తో చూడచక్కగా ఉన్న ఈ ఇంటిని నిర్మించడానికి దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఇంద్ర భవనం ముందు భాగంలో పచ్చని తోట, అందులో కాలానుగుణమైన పువ్వులు భలే కనువిందు చేస్తాయి. ఇంటి డిజైన్ కోసం చిరంజీవి తనయుడు రామ్ చరణ్.. తహిలియాని హోమ్స్ సేవలు వినియోగించుకున్నాడని చిరు కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

రామ్ చరణ్, అతడి భార్య ఉపాసన కామినేనితోపాటు చిరంజీవి భార్య సురేఖ సైతం ఇంట్లోని ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్ చేయించినట్టు తెలుస్తుంది. గ్లాస్ టేబుల్ తోపాటు నిజాం వాల్ డిజైన్, షాండ్లియర్, డైనింగ్ స్పేస్ యొక్క అందమైన వాతావరణం చూపు తిప్పుకోనివ్వవు. ఇంట్లో హెరిటేజ్ స్పూర్తితో తీసుకున్న సమకాలీన డిజైన్లు కనువిందు చేస్తాయి. ఆర్కిటెక్చర్ సంస్థ చిరంజీవి ఇంటి ముందు భాగాన్ని ఆధునిక శైలి ప్యాలెస్ గా కనిపించేలా చక్కని డిజైన్ చేసింది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ వర్కుతో పూర్తి చేశారు. వుడెన్ కేబినెట్ పక్కనే ఉన్ గ్లాస్ ప్యానెల్ కొత్త అందాలను తీసుకొచ్చింది.
ఇల్లు మొత్తం భారతీయత నింపేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన కళాఖండాలు, వస్తువులను అమర్చారు. ఇంటీరియర్ ను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు వినూత్నమైన లైట్ ఫిక్చర్లు, షాండ్లియర్లు ఏర్పాటు చేశారు. ఓ గదిలో చదరంగం బోర్డును తలపించే నలుపు, తెలుపు ఫ్లోరింగ్ ఔరా అనిపిస్తుంది. అలాగే లోపల చాలా చోట్ల కుండీలలో మొక్కలతో పాటు ఆకులతో నిండిన అనేక పెద్ద బాల్కనీలు ఉన్నాయి. ఇవి చాలా సహజమైన కాంతితో పాటు సానుకూల శక్తిని అందిస్తాయి. ఇంటీరియర్ కు సంబంధించి చాలా అంశాలు హైదరాబాదీ నిజామీ డిజైన్లను పోలి ఉంటాయి. మొత్తానికి చిరంజీవి నివాసం సంప్రదాయ, ఆధునిక శైలులతో కూడిన ప్యాలెస్.

This website uses cookies.