Categories: LATEST UPDATES

ఐదేళ్లలో ఆతిథ్య రంగం అదుర్స్

రెండు నుంచి ఐదేళ్లలో 2.3 బిలియన్లకు మించి పెట్టుబడులు
2023లో 12వేల హోటల్ గదులు వచ్చే అవకాశం

భారత్ లో ఆతిథ్య రంగం పూర్వ వైభవం సంతరించుకునే దిశగా ముందుకెళ్లనుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ అభిప్రాయపడింది. ఇండియన్ హాస్పిటాలిటీ రిపోర్ట్, ఇండియన్ హాస్పిటాలిటీ సెక్టార్: ఆన్ ఏ కమ్ బ్యాక్ ట్రైల్ ఫలితాలను తాజాగా వెల్లడించింది. కరోనా తర్వాత వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగా జరగడం, ప్రయాణ పరిమితుల తొలగింపు, స్థిరమైన ఆర్థిక వృద్ధి వంటి అంశాలు ఆతిథ్య రంగాన్ని పునరుద్ధరణ మార్గంలో పయనింపజేస్తున్నాయని పేర్కొంది. రాబోయే రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో ఈ రంగంలో 2.3 బిలియన్ డాలర్లకు పైనే పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. 2020-2023 కాలంలో 0.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొంది. అలాగే ఒక్క 2023లోనే కొత్తగా 12వేల హోటల్ గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కరోనా తర్వాత దేశంలో పర్యాటక రంగం క్రమంగా పుంజుకుంది.

2021లో దేశీయ సందర్శకులు 151 బిలియన్ డాలర్లు వెచ్చించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. స్వదేశీ సెమీ హై స్పీడ్ రైళ్ల ప్రారంభం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ వంటి మౌలిక సదుపాయాల కార్యక్రమాలు దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని, తద్వారా ఆతిథ్య రంగానికి పూర్వ వైభవం వస్తుందని నివేదిక పేర్కొంది. ‘ఇటీవల కాలంలో అనేక అంతర్జాతీయ హోటళ్లు దేశంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. ఆతిథ్య సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అనేక పీఈ ఫండ్ లు దేశీయ, అంతర్జాతీయ హాస్పిటాలిటీ ఆపరేటర్లలో తమ పాదముద్రను దేశంలో విస్తరించాలని చూస్తున్నాయి. సంస్కరణలపై ప్రభుత్వం నిరంతర దృష్టి పెట్టడం వల్ల కూడా ఈ రంగం ప్రయోజనం పొందింది. ఫలితంగా 2028 నాటికి దేశంలోని పర్యాటక, ఆతిథ్య రంగం సందర్శకుల ఎగుమతులు ద్వారా 50.9 బిలియన్ డాలర్లను ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని సీబీఆర్ఈ సౌత్ ఈస్ట్ ఏసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా చైర్మన్, సీఈఓ అన్షమన్ మ్యాగజీన్ తెలిపారు.

This website uses cookies.