ఎనిమిదేళ్లలో మారిన స్థిరాస్తి ముఖచిత్రం
తెలంగాణలో మాత్రం అంత సీన్ లేదు!
దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రెగ్యులేటరీ సంస్కరణల దగ్గర నుంచి మార్కెట్ డైనమిక్స్, సాంకేతికను అందిపుచ్చుకోవడం, కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారడం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా రెరా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత స్థిరాస్తి రంగంలో భారీ మార్పులు వచ్చాయి. రెరా చట్టం దేశ రియల్ రంగ ముఖచిత్రాన్ని మార్చేసింది.
2016లో అమల్లోకి వచ్చిన రెరా.. కొనుగోలుదారుల కష్టార్జితం అక్రమార్కుల పాలుకాకుండా కాపాలా కాస్తోంది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత పెంపొందించడంతో పాటు జవాబుదారీతనం తీసుకొచ్చింది. అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుతూనే రియల్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతోంది. రెరా రాక ముందు ఈ రంగం అనేక సవాళ్లో కొట్టుమిట్టాడింది. ముఖ్యాం పారదర్శకత లేకపోవడం, అక్రమాలు, మోసాలు జరగడం, ప్రాజెక్టులు జాప్యం కావడం, కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య వివాదాలు తలెత్తడం వంటివి జరిగేవి. రెరా చట్టం వీటన్నింటికీ చెక్ పెట్టింది. డెవలపర్లలో జవాబుదారీతనం పెంపొందించడంతోపాటు పారదర్శకత తీసుకొచ్చింది. ప్రాజెక్టులు జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటోంది.
రెరా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన ప్రాజెక్టులు ఎన్ని? వచ్చిన ఫిర్యాదులు ఎన్ని? వాటిలో పరిష్కారమైనవి ఎన్ని వంటి వివరాలతో అనరాక్ గ్రూప్, నరెడ్కో కలిసి ఓ నివేదిక విడుదల చేశాయి. దాని ప్రకారం రెరా వచ్చిన తర్వాత దేశ్యవాప్తగా ఎనిమిదేళ్లలో మొత్తం 1,21,891 ప్రాజెక్టులు అందులో నమోదయ్యాయి. 92,557 మంది ఏజెంట్లు రెరాలో నమోదు చేసుకున్నారు. మొత్తం 20 రాష్ట్రాల్లో 97,784 ఫిర్యాదులు రెరా యంత్రాంగం పరిష్కరించింది. ‘ప్రతి రాష్ట్రంలో రెరా పనితీరులో చాలా తేడాలున్నాయి. కొన్ని రెరాలు కొనుగోలుదారులకు అనుకూలంగా ఉండగా..
మరికొన్ని రెరాలు బిల్డర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. ఎవరైనా బిల్డర్ కొనుగోలుదారును మోసం చేస్తే వారిపై చర్యలు తీసుకోని రెరాలు కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా కొనుగోలుదారు నష్టపోయే పరిస్థితి లేకుండా రెరా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి’ అని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు పేర్కొన్నారు. కొనుగోలుదారులను మోసం చేసే బిల్డర్ల పట్ల రెరా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కొనుగోలుదారులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని, రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు రెరాలో 8045 ప్రాజెక్టులు నమోదు కాగా, 3342 మంది ఏజెంట్లుగా రిజిస్టర్ అయ్యారు. 1092 ఫిర్యాదులను పరిష్కరించారు. ఏపీ విషయానికి వస్తే.. 4617 ప్రాజెక్టులు రెరాలో నమోదు కాగా, 195 మంది ఏజెంట్లు రెరాలో రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటివరకు 163 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి.
తెలంగాణలో రెరా పనితీరు కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్‌ను రెరా ఛైర్మన్‌గా నియమించడం వల్ల ప్రీలాంచుల్ని పెద్దగా అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దొంగతనం జరిగిన తర్వాత బాధితులొచ్చి ఫిర్యాదు చేస్తేనే కేసు రాసుకుంటామనే రీతిలో టీఎస్ రెరా వ్యవహరిస్తోంది. అంతేతప్ప, ఫలానా చోట దొంగతనం జరుగుతోందని తెలిసినా.. దొంగల్ని పట్టుకోవడం తమ కర్తవ్యం కాదన్నట్లుగా ఈ విభాగం భావిస్తోందని ఫిర్యాదాదారులు అంటున్నారు. ఏదీఏమైనా, రెరాను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిపై ఉందని చెబుతున్నారు.
This website uses cookies.