Categories: AREA PROFILE

దుబాయ్ లో రియల్ భూమ్

రికార్డు స్థాయిలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు
పెరుగుతున్న అద్దెలతో పలువురు బెంబేలు

దుబాయ్ లో రియల్ భూమ్ పరుగులు పెడుతోంది. ప్రాపర్టీలు హాట్ కేకుల్లా అమ్మడు కావడంతో రికార్డు స్థాయిలో రియల్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఆకాశహర్మ్మాలకు, అల్ట్రా లగ్జరీ విల్లాలకు పెట్టింది పేరైన దుబాయ్ లో గతేడాది భారీగా రియల్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు కోటీశ్వరులు దుబాయ్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చాలా ఎక్కువ మంది దుబాయ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా దాదాపు 140 బిలియన్ డాలర్ల రియల్ లావాదేవీలు నమోదయ్యాయి. వార్షికంగా చూస్తే ఇది ఏకంగా 76 శాతం ఎక్కువ. అయితే, ఈ భూమ్ అద్దెదారులకు భారంగా పరిణమించింది. అద్దెలు విపరీతంగా పెరిగాయి. దుబాయ్ మార్కెట్ గతేడాది చాలా తీవ్రమైన మార్పులకు లోనైందని, భూ యజమానులకు ఇది మంచిదే అయినప్పటికీ, అద్దెదారులకు మాత్రం భారంగా పరిణమిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
యూఏఈ రాజధాని అబుదాబీలో చమురు సమృద్ధిగా ఉండకపోయినా.. ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన కార్మికులు అందించే చౌక సేవలు, పన్ను ప్రోత్సాహకాలు, విలాసవంతమైన జీవనశైలితో దుబాయ్ ప్రవాసులను ఆకర్షిస్తోంది. అంతేకాకుండా దుబాయ్ లోని లగ్జరీ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో ప్రధానమైన పెద్ద నగరాల కంటే చౌకగా ఉంది. దీంతో పలువురు దుబాయ్ లో నివసించడానికి మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న తరుణంలో చాలామంది రష్యన్ పెట్టుబడిదారులు దుబాయ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో రష్యన్లే అతిపెద్ద విదేశీ కొనుగోలుదారులు కావడం ఇందుకు నిదర్శనం.

This website uses cookies.