- ధర ఒక్కటే ప్రామాణికం కాదు..
- న్యాయపరమైన చిక్కులు ఎదురైతే ఎలా?
- సకాలంలో నిర్మాణం పూర్తి చేయగలడా?
- ప్రీలాంచ్‌లు సొంతింటిని అందించలేవు
- ఆలోచించి కలల గృహం వైపు అడుగేయాలి
కరోనా వల్ల రెండేళ్ల నుంచి ఆందోళన.. మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్.. నగరాన్ని వదిలిపెట్టి సొంతూర్లకు వెళ్లిపోయిన వేలాది మంది యువత.. వందలాది ఐటీ కుటుంబాలు.. ఎక్కడ చూసినా నగరంలో టూ లెట్ బోర్డులే.. రెండేళ్లుగా మూతపడిన వ్యాపారాలు ఆరంభమైనా.. కోలుకోవడానికి ఒకట్రెండేళ్లు పడుతుంది.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్దగా పని లేదు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సొంతిల్లు కొనుక్కోవాలని చాలామందికి ఆశ ఉంది. కానీ, ఫ్లాట్ల ధరలు చూస్తేనేమో ఆకాశాన్నంటేశాయి. మరి, సొంతిల్లు కొనుక్కోవాలంటే ఏం చేయాలి?
కష్టపడి సంపాదించిన సొమ్మును బయటికి తీయించాలంటే.. వారిలో ఆశ పుట్టించాలి. రేటు తక్కువనే ఆశ కలిగించాలి.. ఇప్పుడు కొనకపోతే మరెప్పుడూ కొనలేరని నమ్మించాలి.. ఏడాదికో, రెండేళ్లకో వద్దంటే సొమ్ము వాపసిస్తామనే తప్పుడు హామీలివ్వాలి.. ఇలాంటి ఆశలు, తప్పుడు హామీల మీదే ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ వ్యాపారం జరుగుతోంది. చిన్న సంస్థ నుంచి బడా రియల్ కంపెనీలన్నీ చేస్తున్నవివే. ఇందులో ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువేం కాదు. ఎవరి స్థాయిలో వారు జనాల దగ్గర్నుంచి సొమ్ము లాగేస్తున్నారు. అవసరం లేకున్నా.. అధిక అంతస్తులు కట్టాలనే యావతో.. ముందే జనాల దగ్గర సొమ్ము గుంజేందుకు కొందరు డెవలపర్లు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కాకున్నా.. ముందు ముందు అనుమతి తీసుకుంటామని.. అప్పుడైతే రేటు మరింత పెరుగుతుందని ప్రలోభపెట్టి.. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. లక్షల రూపాయల్ని దండుకుంటున్న ప్రబుద్ధులున్నారు.
అసలెవరు కట్టమన్నారు?
ఒకట్రెండు సంస్థలైతే మరీ విచిత్రంగా వ్యవహరిస్తున్నాయి. కోకాపేట్‌లో ముప్పయ్, నలభై అంతస్తులు కడతాయట. ముందు వంద శాతం సొమ్ము కడితే చదరపు అడుక్కీ రూ.4500కే ఫ్లాటు ఇస్తాయట.కొల్లూరులో మరొక సంస్థ చదరపు అడుక్కీ రూ.3500కే అందజేస్తుందట. ఉప్పల్‌లో రూ.3000లోపు, పోచారంలో రూ.2500కే ఇస్తారట. అసలీ సంస్థలకు ఓ ప్రాజెక్టును నిర్మించడమంటే ఏమిటో తెలుసా? ఒక ప్రాజెక్టు ప్లానింగ్ నుంచి పూర్తయ్యే వరకూ డెవలపర్లు ఎంతెంత మానసిక ఒత్తిడికి గురవుతారు? ఎన్నెన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో తెలుసా? మరి, ఇలాంటి వారంతా ఇన్నిన్ని స్కీముల్ని అందజేస్తలేరే.. ఎందుకంటే, అది వర్కవుట్ అవ్వదని వాళ్లకు ముందే తెలుసు.