గత పదేళ్లలో 3కోట్ల మందికి పైగా ఉపాధి
నరెడ్కో, అనరాక్ నివేదికలో వెల్లడి
మనదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగంగా ఉన్న రియల్ ఎస్టేట్ లో ఉపాధి రేటు గణనీయంగా పెరిగింది. 2013లో రియల్ రంగంలో ఉపాధి పొందినవారి సంఖ్య 4 కోట్లు ఉండగా.. గత పదేళ్లలో అది ఏకంగా 7.1 కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో), రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. రియల్ ఎస్టేట్ అన్ బాక్స్డ్: ది మోడీ ఎఫెక్ట్ పేరుతో ఈ నివేదిక విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశంలోని రియల్ రంగం బాగా లాభపడిందని అందులో పేర్కొన్నారు.
దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో రియల్ రంగం వాటా 18 శాతానికిపైగా ఉంది. 2014 నుంచి 2023 మధ్యకాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 29.32 లక్షల యూనిట్ల ఇళ్ల సరఫరా జరగ్గా.. అదే కాలంలో 28.27 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. రెరా, జీఎస్టీ, పీఎంఈవై వంటి వివిధ పథకాలతో దేశంలోని రియల్ రంగం బాగా ఊపందుకుందని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు పేర్కొన్నారు. అలాగే హౌసింగ్ ధరలు గణనీయమైన డిమాండ్ నమోదు చేయడంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్ వృద్ధి జరిగిందని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. కాగా, రెరా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.23 లక్షల ప్రాజెక్టులు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు 1.21 లక్షలకు పైగా వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కరించారు.
మొన్న తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కారణంగా తెలంగాణ రియల్ రంగం ఎలా వృద్ధి చెందిందనే అంశంలో కొన్ని సంస్థలు నివేదికను వండివార్చినట్టే.. ఈ రిపోర్టూ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా, ఎన్నికల సమయంలో ఇలాంటి నివేదికలు విడుదల కావడం సర్వసాధారణమని నిపుణులు అంగీకరిస్తున్నారు. గత పదేళ్లలో నిర్మాణ రంగానికి ప్రధాని మోడీ నిజంగానే సరికొత్త దిశానిర్దేశం చేసి ఉన్నట్లయితే.. 2020 తర్వాత నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గుముఖం పట్టాయనే విషయాన్ని నివేదికలో పెద్దగా విశదీకరించలేదు.