కింగ్ జాన్సన్ కొయ్యడ : తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సాహాకర ప్రభుత్వం ఉండటం వల్ల.. 2021లో మన నిర్మాణ రంగం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగింది. తొలుత కాస్త తడబడినప్పటి, ఆ తర్వాత ఊపందుకుంది. పొరుగు రాష్ట్రం నుంచి పెట్టుబడులు వరదలా వచ్చి పడ్డాయి. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడే ఎకరాల కొద్దీ కొన్నారు. మార్కెట్ జోష్‌గా ఉందని కొందరు ప్రబుద్ధులు అడ్డదారుల్లో సొమ్ము సంపాదిద్దామని మన రియల్ రంగంలోకి ప్రవేశించినా.. కొనుగోలుదారులు తెలివిగా వ్యవహరించారు. నిర్మాణాలు పూర్తి చేసే డెవలపర్ల వద్ద ఇళ్లను కొంటామని కంకణం కట్టుకున్నారు. అందుకే, రియల్ రంగం విషయానికి వస్తే.. 2021వ సంవత్సరం సూపర్ హిట్ అని చెప్పొచ్చని నిర్మాణ సంఘాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి.
కరోనా వల్ల మొదటి మూడు నెలలు కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. మార్చి తర్వాత మార్కెట్లో మార్పు స్పష్టంగా కనబడుతూ వచ్చింది. అప్పట్నుంచి ఇంటి అమ్మకాలు పెరిగి, ఆతర్వాత మార్కెట్లో సరికొత్త జోష్ నెలకొంది. ఈ పోకడ మధ్య సెప్టెంబరు వరకూ కొనసాగింది. ఊహించని రీతిలో కొనుగోలుదారులు ఇళ్లను కొన్నారు. ఆతర్వాత యూడీఎస్, ప్రీలాంచులు ఆరంభం కావడంతో పెట్టుబడిదారుల సంఖ్య పెరిగారు. దీంతో అసలైన కొనుగోలుదారుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. అందుకే, ఇల్లు కొనే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. డిసెంబరు 15 నుంచి జనవరి 15 దాకా ఫ్లాట్లు కొనేవారు గణనీయంగా తగ్గుతారు. ఆతర్వాత మార్కెట్ యధావిధిగా అభివృద్ధి పథంలో దూసుకెళుతుంది. మా టీబీఎఫ్‌లో దాదాపు 800 బిల్డర్లు ఉన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో నిర్మాణాల్ని చేపడుతున్నారు.
– ప్రభాకర్ రావు, అధ్యక్షుడు, టీబీఎఫ్
తెలంగాణ నిర్మాణ రంగం పనితీరు 2021లో మెరుగ్గా ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల్ని ఆకర్షించింది. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి విచ్చేశాయి. అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం కావడం.. మౌలిక సదుపాయాల్ని మెరుగ్గా అభివృద్ధి చేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ వంటి ప్రోత్సాహాకర విధానాల వల్ల రియల్ రంగంలో సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వంటి గడ్డు కాలంలోనూ.. ప్రపంచానికి అవసరమయ్యే 40 శాతం బల్క్ డ్రగ్స్ ఎగుమతులు హైదరాబాద్ నుంచే నమోదు కావడం మన ప్రత్యేకతను చాటి చెబుతోంది.
– సునీల్ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ట్రెడా
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నిర్మాణ రంగం మీద కొంత మేరకు పడింది. అక్టోబరులో అమ్మకాలు తగ్గాయి. పండగ సీజన్ ఇందుకు కారణమని చెప్పొచ్చు. నవంబరు నుంచి మార్కెట్లో ఉత్సాహం నెలకొంది. దాదాపుగా ప్రతి బిల్డర్ అమ్మకాలు మెరుగ్గానే జరిపారు. 2021లో ధరణి వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాం. ఇందులో సమస్యలు ఏర్పడితే పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం లేదు. మాన్యువల్ నుంచి టెక్నాలజీకి రికార్డుల్ని మార్చే ప్రక్రియలో అనేక తప్పిదాలు దొర్లాయి. ఇందులో భూయజమానుల తప్పేం లేదు. కాబట్టి, వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రతిజిల్లాలో ట్రిబ్యునల్‌ని ఏర్పాటు చేయాలి. మూడు నుంచి నాలుగు నెలల్లోపే ధరణి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి.
– రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్ హైదరాబాద్
వేరే రాష్ట్రాలతో పోల్చితే 2021లో మార్కెట్ మెరుగ్గా ఉంది. ఇక్కడ కనీస ప్రమాణాలు పడిపోలేదు. కరోనా పెద్దగా ప్రతికూలప్రభావం చూపలేదు. ఐటీ, ఫార్మా, వ్యవసాయం వంటివి మెరుగ్గా ఉన్నాయి. ఐటీ విభాగంలో ఇంటి నుంచి పని చేశారు. కొన్ని ఐటీ కంపెనీలు బోనస్ కూడా ప్రకటించడం గమనార్హం.
పరిశ్రమల మీద ఆధారపడ్డ రాష్ట్రాల్లో కొన్ని దెబ్బతిన్నాయి. గతేడాదితో పోల్చితే.. 2021లో స్థలాలు, ఫ్లాట్ల అమ్మకాలు పెరిగాయి. వాస్తవానికి, కొవిడ్ కాలంలో భూముల ధరలు పెరిగాయి. కార్మికుల కొరత అధికమైంది. తెలంగాణలో గ్రోత్ రేటు ఆశించిన స్థాయి కంటే మెరుగ్గా ఉంది. అందుకే, కాస్త వికృత పోకడలు రియల్ రంగంలోకి ప్రవేశించాయి. ఇందులో మంచి స్కీము ఉందని గ్రహించి.. స్కాము చేయడానికి విచ్చేశారు. అలాంటి వారి ఆగడాల్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నాం.
– జీవీ రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్
This website uses cookies.