Categories: LATEST UPDATES

రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7 శాతం?

తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్దగా ఇష్టం లేదు. ఔను.. ఎవరూ ఔనన్నా.. కాదన్నా.. ఇది ముమ్మాటికి నిజం. అందుకే, గత ఏడేళ్ల నుంచి భూముల విలువల్ని పెంచేందుకు వ్యతిరేకిస్తూ వచ్చారు. కాకపోతే, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్లో రియల్ రంగానికి ఎక్కడ్లేని గిరాకీ ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ భూముల్ని కొనేవారు పెరిగారు.

విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు చెందిన ప్రవాసుల్లో కొందరు హైదరాబాద్లోనే ఫ్లాట్లు, విల్లాల్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతిన్నది. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా పెద్దగా భూముల మార్కెట్ విలువల్ని పెంచకూడదని నిర్ణయించింది. కాకపోతే, ఏడేళ్ల నుంచి పెంచకపోవడంతో.. మార్కెట్ విలువకు, ప్రభుత్వ విలువల మధ్య భారీ తేడా ఏర్పడింది. దీంతో, ఈ విలువల్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి విన్నవిస్తోంది. దీంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం కొంత శాతం మాత్రమే విలువల్ని పెంచేలా నిర్ణయించేందుకు అంగీకరించారని సమాచారం.

* రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు దాదాపు యాభై నుంచి వంద శాతం పెరిగేందుకు ఆస్కారముందని తెలుస్తోంది. పైగా, ఇప్పటివరకూ ఆరు శాతమున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఏడు శాతం చేసే అవకాశం ఉందని సమాచారం. మరి, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడుతుందో తెలియాలంటే మరికొంత సేపు వేచి చూడాల్సిందే.

This website uses cookies.