భూమీ లేనే లేదు.. ప్రాజెక్టు కూడా లేదు.. ఇంకా చెప్పాలంటే అసలా కంపెనీయే లేదు.. అయినా, అవన్నీ ఉన్నాయని నమ్మించే రియల్ మోసగాళ్ల సంఖ్య పెరిగింది. ఇలా షెల్ కంపెనీలను సృష్టించి.. భారీ ప్రాజెక్టుల్ని కడుతున్నామని కల్లిబొల్లి కబుర్లు చెప్పి.. రేటు తక్కువని మాయమాటలు చెప్పి.. సోషల్ మీడియాలో ప్రకటనల్ని గుప్పించి.. అందినకాడికి దండుకుని ఆతర్వాత బోర్డు తిప్పేసే మాయగాళ్ల సంఖ్య పెరుగుతోంది.
ఇలాగే, షెల్ కంపెనీని సృష్టించి కొనుగోలుదారుల్నుంచి కోట్లు కొట్టేసి.. ఆతర్వాత పోలీసులకు చిక్కాడో మోసగాడు. కాబట్టి, మీరు కూడా ఎవరైనా ధర తక్కువకు ప్లాట్లు, ఫ్లాట్లు, ఫామ్ ప్లాట్లు, వ్యక్తిగత ఇళ్లను అమ్ముతున్నామంటే.. వారి పూర్వాపరాల్ని సేకరించాకే.. మీకు పూర్తిగా భరోసా వచ్చాకే అందులో పెట్టుబడి పెట్టండి. లేకపోతే, మీ కష్టార్జితం కాస్త ఇలాంటి మోసగాళ్ల పాలవుతుంది.
సామాన్యుల సొంతింటి కల అనే ఆకాంక్షను నిర్దాక్షిణ్యంగా సొమ్ము చేసుకునే ఘనులు కోకొల్లలు. ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో రకరకాలు వేషాలు, మోసాలతో సామాన్యులు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దోచుకుంటున్నారు. ప్రీలాంచ్ దందా సహా రియల్ రంగంలో ఎన్నో మోసాల్ని చూస్తున్నాం. అలాంటి వాటిలో ఇది కాస్త విభిన్నమైంది.
దక్షిణ ఢిల్లీకి చెందిన సంజీవ్ కుమార్ మావి 2016-17లో తన బావమరిది పవన్ భదానతో కలిసి ఇళ్ల కొనుగోలుదారులను మోసం చేయాలని పథకం వేశాడు. ఇందుకోసం తన స్నేహితుడు రవి శుక్లా ద్వారా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశాడు. డ్రీమ్ ల్యాండ్ ప్రమోటర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేశారు. అనంతరం ద విల్లోస్ లగ్జరీ అపార్ట్ మెంట్స్ పేరుతో నకిలీ ప్రాజెక్టు లాంచ్ చేశారు. తర్వాత కొనుగోలుదారులను ఆకర్షించి వారి నుంచి సొమ్ము వసూలు చేశారు.
ఇలా దాదాపు రూ.1.75 కోట్లు కొల్లగొట్టిన తర్వాత ఘజియాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మూసేసి పారిపోయారు. అనంతరం ఈ వ్యవహారంపై కేసు నమోదు కావడంతో పోలీసులు పవన్, శుక్లాను అరెస్టు చేశారు. కానీ మావి దొరకలేదు. దీంతో అతడి ఆచూకీ చెప్పినవారికి రూ.25 వేలు నజరానా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మావి ముంబైలో ఉన్నట్టు తెలియడంతో పోలీసులు అక్కడకు వెళ్లి మాటు వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన పోలీసులు.. నకిలీ ప్రాజెక్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
This website uses cookies.