పంచాయతీ లేఅవుట్లలో నిలిపివేసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ రియల్టర్ల సంఘం గురువారం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్లకు వినతి పత్రాల్ని అందజేసింది. 2020 ఆగస్టు 26న రిజిస్ట్రేషన్ల శాఖ పంచాయితీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసింది. అప్పట్నుంచి పంచాయతీ ప్లాట్లను కొన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సక్రమం అయినప్పటికీ, తెలిసో తెలియకో అనేకమంది కొనుగోలుదారులు పంచాయితీ లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేశారు.
హెచ్ఎండీఏ లేఅవుట్లతో పోల్చితే పంచాయతీ ప్లాట్లలో రేటు తక్కువుండటమో ప్రధాన కారణమని చెప్పొచ్చు. అయితే, రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం వల్ల సామాన్య కొనుగోలుదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కొందరైతే తమ ఆడ పిల్లల పెళ్లిళ్లను కూడా వాయిదా వేసిన సందర్భాలున్నాయి. మరికొందరేమో అటు పంచాయతీ ప్లాట్లను అమ్ముకోలేక.. అందులో ఇల్లు కట్టుకోలేక అగచాట్లు పడుతున్నారు. అయితే, ఈ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరడంతో.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. మరోవైపు, తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలంగాణ రియల్టర్ల సంఘం ఛైర్మన్ నారగోని ప్రవీణ్ కుమార్ తెలిపారు.
This website uses cookies.