Categories: TOP STORIES

ఎస్టీపీలను క‌ట్ట‌డం బ‌దులు ఎఫ్‌టీఎల్లో ఆక్ర‌మ‌ణ‌ల్ని తొల‌గించాలి!

పర్యావరణవేత్త డా.లుబ్నా సార్వ‌త్ డిమాండ్‌

  • ఎఫ్‌టీఎల్‌లో అక్ర‌మ నిర్మాణాలు
  • వాటిని ర‌క్షించేందుకు నీళ్ల గేట్ల ఎత్తివేత
  • క్యాచ్‌మెంట్ ఏరియాలో గ్రీన్ సిటీ ఏంటి?
  • స‌హ‌జ‌సిద్ధంగా పారే న‌ది నీళ్ల‌ను వ‌దిలేసి కాళేశ్వ‌రం నుంచి నీళ్ల‌ను ఎత్తిపోయ‌డం క‌రెక్టా?
  • హైద‌రాబాద్ ను హుస్సేన్ సాగ‌ర్ చేస్తారా?
  • 111 జీవో తొల‌గిస్తే న‌గ‌రం ఢిల్లీలా మునుగుతుంది
  • ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌ళ్లు తెర‌వాలి

ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతంలోని ఎఫ్‌టీఎల్‌లో నెల‌కొన్న అక్ర‌మ నిర్మాణాల్ని వెంట‌నే తొల‌గించాల‌ని ప్ర‌ముఖ ప‌ర్యావర‌ణ‌వేత్త డాక్ట‌ర్ లుబ్నా సార్వ‌త్ డిమాండ్ చేశారు. వీటిని కాపాడుకునేందుకే హిమాయ‌త్ సాగ‌ర్ నిండ‌కుండానే నీటిని కింది వ‌దిలివేస్తున్నార‌ని ఆరోపించారు. అక్క‌డ గ‌ల నిర్మాణాల్ని ర‌క్షించుకునేందుకు ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే తాగునీటిని వృథాగా వద‌లివేయ‌డం దారుణ‌మైన విష‌యం అన్నారు. ఇంకా ఏమ‌న్నారో ఆమె మాట‌ల్లోనే..

ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతాల్లో ఫీల్డ్ సర్వేలు చేశాం. రైతులతో మాట్లాడాం. సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించాం. ఫీల్డ్ సర్వే కీలకమైంది. అక్కడకు వెళ్లి చూస్తే.. ఈ రోజు కూడా హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేశారు. వెయ్యి క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. ఒక క్యూసెక్ అంటే వెయ్యి లీటర్ల పైనే. ఆ నీళ్లను విడుదల చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అఫీషియల్ మ్యాప్స్ లో చాలా ఆక్రమణలు మార్క్ చేసి ఉన్నాయి. ఎఫ్ టీఎల్ లోపల కొత్త నిర్మాణాలు చాలా వచ్చాయి. హిమాయత్ సాగర్ నిండకుండానే నీటిని ఎందుకు వదిలేస్తున్నారో మాకు అర్థమైంది. అక్కడ ఉన్న కట్టడాలను రక్షించుకునేందుకే ప్రజలకు అవసరమైన తాగునీటిని వృథాగా వదిలేస్తున్నారు. ఇది కాకుండా ఒరిజినల్ మ్యాప్స్ ప్రకారం ఉన్న విస్తీర్ణాన్ని చిన్నగా చేసేశారు.

ఉదాహరణకు ఉస్మాన్ సాగర్ ఎఫ్ టీ ఎల్ 5 టీఎంసీ ఉంది. దాని మ్యాప్ కూడా మార్చేశారు. ఉస్మాన్ సాగర్ హోల్డింగ్ కెపాసిటీని 3 టీఎంసీకి తగ్గించేశారు. అదీ కాకుండా ఒరిజినల్ ఫిగర్స్ ప్రకారం 10 టీఎంసీ వరకు దీని హోల్డింగ్ కెపాసిటీ ఉంది. అంటే దాదాపు సగం మేర దాని కెపాసిటీని తగ్గించేశారు. పూడిక తీయకుండా, ఆక్రమణలు తీయకుండా గేట్లు ఎత్తివేస్తున్నారు. వీళ్లు తీయాల్సింది ఆక్రమణలు. కానీ వీరు తీస్తుంది ప్రజల మంచినీళ్ల‌నే విష‌యం అర్థం కావ‌ట్లేదు.

జీవో ట్రిపుల్ వన్ తీసేస్తాం అన్నప్పుడు ప్రజల మంచినీళ్లు ఏంటి? వరదలు వస్తే ఏంటి అనేదానికి సమాధానమే లేదు. ఒక్క సైంటిఫిక్ స్టడీ కూడా లేదు. అసలు రిజర్వాయర్ క్యాచ్ మెంట్లో గ్రీన్ సిటీ అంటే ఏమిటి? ఎస్టీపీలు ఏమీట‌నేది కూడా లేదు. కమిటీ రిపోర్టు ఇవ్వమని అడిగాం. ఇవ్వలేదు. పాత కమిటీ రిపోర్టులు ఇవ్వమని అడిగాం. అది కూడా లేదు. ఆర్టీఐలో ఏమీ సమాధానం ఇవ్వలేదు. పోనీ పైన ఉన్న రైతుల గురించి చెబుతున్నారా అంటే.. అది కూడా ఒకటే ఒక ముక్క చెబుతున్నారు.

వాళ్లు అమ్మాలనుకుంటున్నారు.. వాళ్లు ఎత్తేమయంటున్నారు కాబట్టి మేం ఎత్తేసినాం అని చెబుతున్నారు. చట్టం ఏం చెబుతుందో లేదు. పోనీ ఆ రైతుల వివరాలు కూడా లేవు. అది అడిగితే కూడా చెప్పరు. వాళ్ల కోసం అంతగా ఎందుకు భయపడి జీవోను ఎత్తివేస్తున్నారో మేం తెలుసుకోవాలి కదా? ఆ డెవలప్ మెంట్ ఏమిటో ప్రజలందరికీ తెలియాలి కదా? అక్కడకు వెళ్లి మేం రైతుల్ని అడిగినాం. మీ దగ్గర డెవలప్ మెంట్ కోసం 111 జీవోను ఎత్తివేస్తున్నారంట కదా అంటే.. ఏం డెవలప్ మెంట్? మేం ఎవరూ అమ్మాలనుకోవడం లేదని అక్క‌డి రైతులు చెబుతున్నారు.

ఏం నిషేధం?

Remove Encroachments in 111 GO Areas, Instead of constructing New STP’s

జీవో ట్రిపుల్ వన్ లో ముఖ్యమైన అంశాలు రెండున్నాయి. అక్కడ ఏం నిషేధమో స్పష్టంగా, లిఖితపూర్వకంగా రాసి ఉంది. పెద్ద హోటల్స్, మాల్స్, కాలుష్యకారక పరిశ్రమలు, హైరైజ్ బిల్డింగ్స్ రాకూడదని రాసి ఉంది. దాని కిందే అగ్రికల్చర్ కానీ, హార్టీకల్చర్ కానీ, ఫ్లోరీకల్చర్ కానీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరి వ్యవసాయం అనేది డెవలప్ మెంట్ కాదా? కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం బంద్ అయిన‌ప్పుడు ఒకే ఒక్క అగ్రికల్చర్ ప‌ని చేసింది క‌దా.. మ‌రి, ఆ రంగాన్ని అభివృద్ధి చేయాలి క‌దా.. వాళ్లకు నీళ్లను సరిగా సరఫరా చేయాలి. విత్తనాలు ఇవ్వాలి. వారు పండించిన పంటలను మేం కొంటామని మార్కెటింగ్ ఇస్తే ఎవరు ట్రిపుల్ వ‌న్ జీవోలోని భూముల్ని అమ్ముతారో ఆలోచించండి. మీరే ఉసిగొల్పి వారి భూముల్ని అమ్మిస్తున్నారు. వాళ్లను భూస్వాముల నుంచి పేదలుగా మారుస్తున్నారు. అంతపెద్ద ధోకా ఈ జీవో ట్రిపుల్ వన్ ఎత్తివేత‌.

స‌హ‌జంగా పారే నీళ్లు వ‌దిలేసి..

Is HMDA Sleeping? Why cant they stop Illegal Encroachments in 111 GO Areas?

హైదరాబాద్ కు నీటి కొరత అనేది ఉండకూడదు. ఈ సిటీ మధ్య నుంచి మూసీ అనే పెద్ద నది వెళుతోంది. ఆ నదికి ఇరువైపులా రెండు బేసిన్లలో వేలకొద్దీ చెరువులు ఉన్నాయి. అవి కాకుండా వందల కొద్దీ బావులు ఉన్నాయి. రెండు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇదీ కాకుండా వర్షపు నీళ్లు పడుతున్నాయి. మనం వేరొకరికి నీళ్లు ఇచ్చేలా సమృద్ధి కలిగి ఉన్నాం. అలాంటి హైదరాబాద్ కు బయట ఎక్కడ నుంచో కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు తెస్తామంటున్నారు.

ఇన్ని నీటి వనరులను వదిలిపెట్టి, ఆ చెరువులు, రిజర్వాయర్లను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చేసి నీళ్ల కోసం మమ్మల్ని మోకాళ్ల మీద కూర్చోబెడుతున్నారు. నీళ్లను దిగుమతి చేసుకోవాలా మేం? మాకు మినిస్ట్రీ ఇవ్వండి. మేం నీళ్లను ఇక్కడ నుంచి ఎగుమతి చేసి చూపిస్తాం. అలాంటిది వీళ్లేమో అక్కడ నుంచి ఎన్నో పరిధులు దాటుకుంటూ నీళ్లు వస్తున్నాయి. మరి అక్కడి రైతులకు నీళ్లొద్దా? అంటే వారి నీళ్లను జబర్దస్తీగా నీళ్లను తీసుకొస్తున్నాం.

కేసీఆర్‌ది అన్‌సైంటిఫిక్ స్టేట్‌మెంట్

KCR Unscientific Statement

కృష్ణా నది, గోదావరి నీళ్లు అనవసరంగా సముద్రంలోకి వెళ్లి వృథా అవుతున్నాయని కేసీఆర్ చెబుతుంటారు. కానీ అది అన్ సైంటిఫిక్ స్టేట్ మెంట్. నీళ్లు సముద్రంలోకి వెళ్లి తీరాలి. ఒక శాతం నీళ్లు వెళ్లాలి. మరి జీహెచ్ఎంసీలో, హెచ్ఎండీసీ పరిధిలో మూసీలో పడుతున్న నీళ్లను మీరు ఎందుకు వదిలేస్తున్నారు? ఈ నీళ్లన్నీ వెళ్లిపోవాలా? కానీ కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలా? ఇది ఏ చట్టం? ఏ సైన్స్? ఏ సెన్స్? వీళ్లు మాటిమాటికీ చెప్పేది ఏంటంటే.. వాళ్లు డెవలప్ మెంట్ కావాల‌ని అంటున్నారు. ఇంత‌కీ వాళ్లెవ‌రు? డెవలప్ మెంట్ ఏంటి? అసలు సిటీలో డెవలప్ మెంట్ ఏంటి? మనం సిటీలో నడిచామంటే అంతా కంపు కొడుతుంది. ప్రతిచోటా నాలాలు. వాటిని హుస్సేన్ సాగర్ లా మార్చబోతున్నారు. అంతా నురుగులు. మేం వీడియో కూడా తీశాం. దానిని రిలీజ్ చేస్తాం. దూరం నుంచి నీళ్లు తీసుకురావడం అనేది తప్పు.

వ‌ర‌ద‌లొస్తే ఏం చేస్తారు?

Concrete Structures in 111 GO Areas.. Why cant HMDA Demolish Such Constructions?

ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడరు. ప్రజలను పిలిచి మాట్లాడరు. సైంటిస్టుల అభిప్రాయాలు తీసుకోరు. జీవో ట్రిపుల్ వన్ 27 ఏళ్లు నిలిచింది. సురానా ఆయిల్ మిల్స్ కి ఉమ్మడి ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానిని సుప్రీం కోర్టు తప్పని చెప్పింది. మరి ఆంధ్రా కంటే మేం మెప్పు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది కదా? మరి జీవో ట్రిపుల్ వన్ తీసేస్తే వందలకొద్దీ సురానా ఆయిల్స్ కు అనుమతి ఇచ్చేసినట్టే కదా? వాళ్లను ఎప్పుడూ తిడుతుంటారు కదా? అలాంటిది వీరు ఇప్పుడు అదే బాటలో వెళుతున్నారు.

సుప్రీంకోర్టు చెప్పిన దానికి, ఉన్న చట్టానికి విరుద్ధంగా వెళుతున్నారు. ఐదు సైంటిఫిక్ రిపోర్టుల మీద నిలబడిన జీవోను ఎత్తివేస్తున్నప్పుడు ఒక్క సైంటిఫిక్ ముక్క కూడా తీసుకు రాలేకపోతున్న‌దీ ప్ర‌భుత్వం. అక్కడ బడా టికెట్లు, వారి ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ సమీకరణలో రైతుల్లేరు.. ప్రజల్లేరు.. వాళ్ల నీళ్ల అవసరాల్లేవు. వరదలు వస్తే ఏం చేయాలో లేదు. మా వైపు నుంచి మేం సిఫార్సులు చేశాం. అక్కడ మొత్తం ఎస్టీపీలు కాదు.. అక్కడ డ్రై లెట్రిన్ జోన్ గా పరిగణించాలి. డ్రై లెట్రిన్ వాడితే ఒక్క చుక్క నీళ్లు బయటకు రావు.

ఢిల్లీ త‌ర‌హా ముప్పు వ‌ద్దు

నేను టీపీసీసీ మెంబర్ కాదు. నేను వారి తరఫున మాట్లాడటం లేదు. టీపీసీసీ పెట్టిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో నేను ఇండిపెండెంట్ మెంబర్ ని. వారు మమ్మల్ని ఇండిపెండెంట్ గానే రిపోర్టు అడిగారు. దానిని రేవంత్ రెడ్డి, కోదండరెడ్డికి ఆ నివేదిక ఇచ్చాం. మా ప్రతిపాదనలు అందులో ఇచ్చాం. వానలు ఎక్కువగా వస్తాయని సైంటిస్టులు చెప్పారు. రిజర్వాయర్స్ కి, అనంతగిరి హిల్స్ కి మధ్యలో పడే వానలను అక్కడే హార్వెస్ట్ చేయాలి. ఈ రిజర్వాయర్లను ఇంకా పెద్దగా చేయాలి. వాటి ఒరిజినాలిటీకి తీసుకురావాలి. అలా చేస్తే ప్రజలకు ఎక్కువ మంచినీళ్లు ఉంటాయి.

ఆక్రమణలు తొలగించాలి, పూడిక తీయాలి. అక్రమ కట్టడాలను మొత్తం కూల్చివేయండి. పుణెలో వర్షాలు పడుతుండగా అలాంటి అక్రమ కట్టడాలను కూల్చేశారు. అలా ఇక్కడ కూడా తీసేయాలి. ఇవన్నీ చేస్తే 22 ఎస్టీపీలు ఎందుకు అవసరమవుతాయి? రైతులకు ఇక్కడే మార్కెట్, నీళ్లు, ప్రైస్ తోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే ఎవరూ వారి భూములు అమ్ముకోరు. ఢిల్లీలో నదిని ఆక్రమించడం వల్లే కదా? ఇళ్లన్నీ మునిగిపోతున్నాయి. అలాంటి ముప్పు హైదరాబాద్ కు రాకూడదంటే పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా దానిని మరింత మెరుగుపరచాలి. ఆ బాధ్యతనే మేం నెరవేరుస్తున్నాం.

This website uses cookies.