Categories: HOME LOANS

ఇంటి మరమ్మతులకు రుణ మార్గాలేవీ?

సొంతింటితో వచ్చే లాభాలు బోలెడు. అయితే, ఎప్పుడైనా మరమ్మతులు చేయించాల్సి వస్తే మాత్రం భారీ ఖర్చు తప్పదు. అలాంటి సమయాల్లో మీరు పొదుపు చేసిన మొత్తాన్నే ఇందుకు వాడేయకుండా ఎక్కడి నుంచి వనరులు సమీకరించాలన్నది చాలా కీలకం. ఒకో సందర్భంలో మన దగ్గర పొదుపు చేసిన మొత్తం కూడా ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇంటి మరమ్మతులకు అవసరమైన సొమ్మును తీసుకురావాలంటే ఎలా అనే సందేహం తలెత్తక మానదు. ఇందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దామా?

హోం ఈక్విటీ లోన్..

హోమ్ ఈక్విటీ లోన్ అనేది హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ లా పనిచేస్తుంది. ఇక్కడ మీ ఇల్లు లోన్ కు కొలేటరల్ గా ఉంటుంది. అయితే, హోం ఈక్విటీ లోన్ తో మీరు మొత్తం రుణాన్ని ముందుగానే తీసుకుంటారు. అలాగే చెల్లింపు కూడా వెంటనే ప్రారంభమవుతుంది. ఈ రుణాలు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లకే అందుబాటులో ఉంటాయి. మీ ఆదాయం, మీ క్రెడిట్ రిపోర్ట్, మీ ఇంటి మార్కెట్ విలువ వంటి అంశాలపై మీరు పొందే లోన్ ఆధారపడి ఉంటుంది.

హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్..

మీరు కనీసం 20 శాతం ఈక్విటీని కలిగి ఉంటే, మీ ఇంటి ఈక్విటీని ట్యాప్ చేయడానికి మీకు హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ అనే మరో మార్గం కూడా ఉంది. ఒకేసారి ఏకమొత్తాన్ని అందించే ఈక్విటీ లోన్ లా కాకుండా క్రెడిట్ కార్డులాగా ఓ రివాల్వింగ్ క్రెడిట్ లైన్ లా ఇది పనిచేస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే ఈ నిధులను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇవి సాధారణంగా వేర్వేరు వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి. అలాగే తీసుకున్న వ్యవధి, చెల్లించే కాలం మీద ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకున్న సొమ్ముకు మాత్రమే వడ్డీ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తిరిగి చెల్లించే వ్యవధి సుమారు 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే అసలు, వడ్డీని నెలవారీ చెల్లించాల్సి ఉంటుంది.

క్యాష్ అవుట్ రీఫైనాన్సింగ్

మీ ఇంట్లో మీరు గణనీయమైన ఈక్విటీ కలిగి ఉంటే, క్యాష్ అవుట్ రీ ఫైనాన్సింగ్ ఆప్షన్.. మీ ప్రస్తుత తనఖాను కొత్తదానితో రీప్లేస్ చేయడానికి అనుమతిస్తుంది. మీరు మీ మిగిలిన తనఖా బ్యాలెన్స్ కంటే పెద్ద మొత్తాన్ని రుణంగా తీసుకోవడం కుదురుతుంది. అలాగే అదనపు నిధులను కూడా అందుకునే అవకాశం ఉంటుంది. క్యాష్ అవుట్ రీ ఫైనాన్సింగ్ మీ ఆదాయం, క్రెడిట్ చరిత్ర ఆధారంగా వస్తుంది. గరిష్ట రుణం మొత్తం విలువ (ఎల్టీవీ) నిష్పత్తి సాధారణంగా 80 శాతం వద్ద ఉంటుంది. అంటే మీ ఇంటి విలువలో 80 శాతం వరకు క్యాష్ అవుట్ చేయొచ్చు.

పర్సనల్ లోన్..

వ్యక్తిగత రుణం అనేది ఇంటి మరమ్మతులకు అవసరమైన మొత్తాన్ని సులభతరంగా అందిస్తుంది. ఇంటి యజమానులు వారి ఆస్తులను తనఖా పెట్టకుండా ఈ రుణం తీసుకోవచ్చు. మీరు వేతనం పొందే వ్యక్తి అయితే, ఇంటి మరమ్మతులకు అవసరమైన మొత్తాన్ని తక్షణమే తీసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. కాస్త అనుకూలమైన వడ్డీ రేట్లు, నిబంధనలు కలిగి ఉన్న పర్సనల్ లోన్ అందుబాటులో ఉంటే, ఇది మీ ఇంటి మరమ్మతులకు అవసరమైన మొత్తాన్ని అందించే మంచి మార్గం.

క్రెడిట్ కార్డు..

ఇంటి మరమ్మతులకు అవసరమైన మొత్తం కోసం క్రెడిట్ కార్డు ఉపయోగించడం అనేది ఓ సులభమైన ఎంపిక. ముఖ్యంగా మీ క్రెడిట్ కార్డులో తగినంత పరిమితి ఉంటే.. ఇది చాలా సులభమైన మార్గం. అయితే, ఇతర రకాల ఫైనాన్సింగ్ ఎంపికలతో పోలిస్తే.. క్రెడిట్ కార్డులు చాలా ఎక్కువ వడ్డీ రేట్లు, తక్కువ రీపేమెంట్ వ్యవధి కలిగి ఉంటాయి. అందువల్ల ఇతరత్రా వడ్డీ రేట్లు దీనితో పోల్చుకుని అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.

ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని, మీ ఇంటి మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతుంది? ఎంత వ్యవధిలోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించగలం వంటివీ బేరీజు వేసుకున్న తర్వాతే ఎక్కడ నుంచి ఏ రూపంలో రుణం పొందాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలి.

This website uses cookies.