దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో గత కొన్నేళ్లగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అద్దె ఇళ్ల మార్కెట్ లో కీలకమైన మార్పులు జరిగాయి. వాస్తవానికి చాలామంది భారతీయులకు సొంతిల్లు అనేది ఓ కల. కానీ ఇప్పుడు ట్రెండ్స్ వేగంగా మారుతున్నాయి. ఎక్కువ మంది సొంత ఇంటి కంటే అద్దె ఇళ్లనే ఎంచుకుంటున్నారు. దీంతో కాలక్రమేణా దేశంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. పట్టణీకరణ వేగంగా పెరగడం, నూక్లియర్ కుటుంబాలు ఎక్కువ కావడం, మారుతున్న జీవనశైలి వంటి అంశాలు దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ఉపాధి, విద్యా అవకాశాల కోసం ప్రజలు పట్టణాలు, నగరాల బాట పడుతుండటంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో అద్దె రేట్లు పెరిగాయి. ఇది రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు లాభదాయకంగా మారింది.
ఇంటి అద్దెలు పెరగడానికి ఆర్థిక అంశాలు కూడా మరో కారణం. ఇల్లు కొనాలంటే డౌన్ పేమెంట్, నెలవారీ వాయిదా, నిర్వహణ తదితర ఖర్చులు భరించాల్సి ఉంటుంది. దీంతో చాలామందికి అద్దె ఇళ్లలో ఉండటమే మెరుగైన ఎంపికగా ఉంటుంది. ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉండాలనుకునేవారికి, ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్నవారికి ఇల్లు కొనడం కంటే అద్దె ఇంట్లో ఉండటమే మంచి ఆప్షన్ గా ఉంటోంది. దీంతో దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది.
అద్దె మార్కెట్ పెరగడానికి మిలీనియల్ జనరేషన్ కూడా ఓ కీలక కారణం. మిలీనియల్స్ ఆస్తుల కంటే అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఒక్కరే సొంతింట్లో ఉండటం కంటే స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉండటానికే మొగ్గు చూపిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, మిలీనియల్స్ కు పెరిగిన కొనుగోలు శక్తి కూడా దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడానికి కారణాలు. మొత్తానికి చూస్తే.. దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు జీవనశైలి మార్పులు కూడా ఉన్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న యువతరం ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుంటే అద్దె ఇళ్ల డిమాండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది. దీంతో అద్దె మార్కెట్ లో రియల్ పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి.
This website uses cookies.