Categories: TOP STORIES

ప్రెస్టీజ్‌తో పాటు 12 సంస్థ‌ల‌కు రెరా నోటీసులు

రెరా అనుమ‌తి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్న ప‌ద‌మూడు రియ‌ల్ సంస్థ‌ల‌కు టీఎస్ రెరా నోటీసుల్ని జారీ చేసింది. దీంతో పాటు నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన ఏజెంట్ల‌పై ఈసారి రెరా కొర‌డా ఝ‌ళిపించింది. రెరా అనుమ‌తి లేకుండా అమ్మ‌కాల్ని చేప‌డుతున్న నీమ్స్ బోరో గ్రూప్, ఎక్సలెన్స్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్ గ్రూప్, సనాలి గ్రూప్, అర్బన్ యార్డ్స్, “హ్యాపీ డ్రిమ్ హోమ్స్, విరతా డెవలపర్స్‌, రి వెండల్ ఫామ్స్, కావూరి హిల్స్, సెవెన్ హిల్స్, బిల్డాక్స్ రియల్ ఎస్టేట్స్, సుమధుర ఇన్ఫ్రా ప్రాజెక్టులకు తాజాగా షోకాజు నోటీసుల్ని జారీ చేసింది.

‘రెరా’ రిజిస్ట్రేషన్ ఉండి కూడా జేబీ నేచర్ వాలీ ప్రకటనలో రెరా రిజిస్ట్రేషన్ నెంబ‌రును చూపించని కారణంగా.. జేబీ ఐన్ఫ్రా ప్రాజెక్టుకు షోకాజ్ నోటీసుల్ని జారీ చేసింది.రెరాలో న‌మోదు కాకుండా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార ప్ర‌క‌ట‌న‌లతో పాటు ఇత‌ర కార్య‌క‌లాపాల్ని నిర్వ‌హిస్తున్న ప‌లువురు ఏజెంట్ల‌పై టీఎస్ రెరా క‌న్నెర్ర చేసింది. హాపీ డ్రీమ్స్ ప్రాజెక్ట్ ఏజెంటు, విరాత డెవలపర్స్ ఏజెంట్ డేవిడ్ రాజు, అర్బన్ యార్డ్స్ ఏజెంట్ లక్ష్మీనారాయన, సెవెన్ హిల్స్ ఏజెంట్ జె. వెంకటేష్ తదితరులకు రెరా షోకాజ్ నోటీసుల్ని జారీ చేసింది.

రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఏజెంట్లు తమ వ్యాపార ప్రకటనల్లో (ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలు) తప్పని సరిగా “రెరా రిజిస్ట్రేషన్ నెంబరును ప్రదర్శించాలని లేక‌పోతే రెరా నిబంధనల్ని ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని టీఎస్ రెరా డా.ఎన్ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఈ నిబంధ‌న‌ను పాటించ‌ని సంస్థ‌లు, ఏజెంట్ల‌పై చట్ట ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌ల్ని తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. కొనుగోలుదారులు ఎలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే.. రెరా అనుమ‌తి ఉన్న వాటిలోనే కొనాల‌ని ఆయ‌న సూచించారు.

This website uses cookies.