Categories: LATEST UPDATES

బిల్డర్ పై రెరా జరిమానా?

రెరా ( RERA ) వద్ద ప్రాజెక్టును నమోదు చేయని ఓ బాలీవుడ్ నిర్మాత, బిల్డర్ ను మహారాష్ట్ర రెరా అథారిటీ వదిలి పెట్టలేదు. హిందీలో కూలీ నెం.1, ప్యార్ కియాతో డర్నా క్యా, బీవీ నెం.1, రెహనా తేరే దిల్ మే వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన వాశు భగ్నానీ.. ముంబైలో ఒక నివాస సముదాయాన్ని ప్రారంభించినప్పటికీ.. రెరాలో నమోదు చేసుకోలేదు. మరి, ఈ విషయం ఎలా బయటికొచ్చింది?

వాశు భగ్నానీ తన భార్య పూజ పేరుతో ‘పూజా డెవ్కాన్’ అనే నిర్మాణ సంస్థ ద్వారా 2000 నుంచి నివాస సముదాయాల్ని నిర్మిస్తున్నాడు. తను ఖార్ లోని లింకింగ్ రోడ్డు వద్ద ఒక అపార్టుమెంట్ ఆరంభించాడు. ఇతని వద్ద నితిన్ మత్లానీ అనే వ్యక్తి ఫ్లాటు కొన్నాడు. ఫ్లాటును త్వరగా తనకు అప్పగించాలని కోరుతున్నప్పటికీ వాశు భగ్నానీ కంపెనీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ అపార్టుమెంట్ రెరా వద్ద నమోదు కాలేదని కొనుగోలుదారుడు గుర్తించాడు. సకాలంలో తన ఫ్లాటును అందించని కారణంగా తనకు న్యాయం చేయాలని మహారాష్ట్ర రెరా అథారిటీని సంప్రదించాడు.

దీనిపై పూజా డెవ్కాన్ సంస్థ స్పందించలేదు. దీంతో మహారెరా ఛైర్ పర్సన్ అజయ్ మెహతా ఈ ప్రాజెక్టును నిర్మాణం కొనసాగుతున్న ప్రాజెక్టుగా గుర్తించాడు. రెరా చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం.. రెరాలో నమోదు చేయకుండా.. ఫ్లాట్లను విక్రయించకూడదు. మార్కెటింగ్ చేయకూడదు. ప్లాటు కానీ ఫ్లాటు కానీ అమ్ముతామని ఆఫర్ కూడా చేయకూడదు. రెరా నిబంధన ప్రకారం.. ప్రాజెక్టు విలువలో పది శాతం సొమ్మును లెక్కించి జరిమానా విధించాలి. దీంతో, రెరా ఛైర్ పర్సన్ సంస్థపై జరిమానా విధించాడు. 30 రోజుల్లోపు ప్రాజెక్టుకు అనుమతి తీసుకోవాలని ఆదేశించాడు.

This website uses cookies.