Categories: LEGAL

ఫార్చ్యూన్ 99 హోమ్స్ పై రెరా విచారణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రీలాంచులు, యూడీఎస్ అక్రమార్కుల ఆటలు సాగవిక. రెరా అనుమతుల్లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ రెరా అథారిటీ విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తితో.. రెరా బృందం న‌గ‌రంలోని ప‌లు ప్రాజెక్టుల్ని ప్ర‌త్య‌క్షంగా త‌నిఖీ చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. క్షేత్రస్థాయి పర్యటనల్ని కూడా చేస్తుంది. అనుమతుల్లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్ని విక్ర‌యిస్తున్న సంస్థ‌ల నుంచి ఆధారాల్ని సేక‌రిస్తోంది.

నగరానికి చెందిన ఫార్చ్యూన్  ఫార్చ్యూన్ 99 హోమ్స్  .. హెచ్ఎండీఏ, రెరా అనుమ‌తి లేకుండానే ముచ్చర్లలో మెడిసిటీ అనే వెంచర్లో ప్లాట్ల‌ను విక్ర‌యిస్తోంద‌ని రెరాకు ఫిర్యాదు అందింది. ఈ సంస్థ ఫేస్ బుక్‌, వాట్స‌ప్‌ల ద్వారా అమ్మ‌కాల్ని చేప‌డుతోంద‌నే ప్రాథ‌మిక స‌మాచారాన్ని సేక‌రించింది. ఈ క్ర‌మంలో భాగంగా రెరా విచార‌ణ షురూ చేసింది. ఆయా ప్రాజెక్టుల్ని ప్ర‌త్య‌క్షంగా సంద‌ర్శించ‌డంతో పాటు సంస్థ‌ కార్యాయలం వ‌ద్ద‌కు వెళ్లి వివ‌రాల్ని సేక‌రించింది. ఇందులో భాగంగా రెరా అథారిటీ కీలక విషయాల్ని తెలుసుకుంద‌ని స‌మాచారం.

ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ హెచ్ఎండీఏకు అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంద‌ని రెరా ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. అక్క‌డ్నుంచి అనుమ‌తి లభించ‌కున్నా.. తెలంగాణ రెరా అథారిటీకి ద‌ర‌ఖాస్తు చేసుకోకున్నా.. ఒక్కో కొనుగోలుదారుడి నుంచి సుమారు రూ. 2 ల‌క్ష‌లు అడ్వాన్సుగా వ‌సూలు చేసింద‌ని తెలుసుకుంది. ఇది పూర్తిగా రెరా చ‌ట్టాన్ని ఉల్లంఘించిన‌ట్లేన‌ని గ్ర‌హించింది. ఒక ప్రమోటర్ ప్లాటు లేదా ఫ్లాటుకు సంబంధించిన ప్రకటనల్ని విడుదల చేయాలనుకున్నా.. అమ్మకాల్ని చేపట్టాలన్నా.. తప్పనిసరిగా రెరా అథారిటీ చట్టం సెక్షన్ 3 (1) ప్రకారం అనుమతి తీసుకోవాలి. కాకపోతే, ఈ సంస్థ రెరా అనుమతి లేకుండానే కొనుగోలుదారుల్నుంచి అడ్వాన్సు తీసుకుంటుందని సమాచారం. రెరా చట్టం సెక్షన్ 59 ప్రకారం.. మొత్తం ప్రాజెక్టు విలువలో పది శాతం సొమ్మును జరిమానా వసూలు చేస్తుంది.

This website uses cookies.