Categories: LATEST UPDATES

కొనుగోలుదారులకు అండగా రెరా

ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (యూపీ రెరా) కొనుగోలుదారులకు అండగా నిలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలను అడ్డుకునేందుకు, కొనుగోలుదారుల హక్కులు కాపాడేందుకు దాదాపు ఆరేళ్ల క్రితం ఏర్పడిన ఈ సంస్థ.. ఇప్పటివరకు 30,500 కేసులను పరిష్కరించింది. దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల్లో 40 శాతం పరిష్కరించామని.. కరోనా సమయంలో వచ్చిన 15 వేల కేసుల్లో 14 వేల కేసులు పరిష్కరించామని యూపీ రెరా చైర్ పర్సన్ రాజీవ్ కుమార్ తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకుని డెవలపర్లు, కొనుగోలుదారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలు పరిష్కరించినట్టు వెల్లడించారు.

డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య నెలకొన్న అగాథాన్ని పూడ్చటానికి యూపీ రెరా ఏళ్లుగా కృషి చేస్తోందన్నారు. దాదాపు రూ.150 కోట్లు డెవలపర్ల నుంచి రికవరీ చేసి కొనుగోలుదారుల ఖాతాలకు బదిలీ చేసినట్టు వివరించారు. అలాగే జాప్యం చేసినందుకు గాను 342 ప్రాజెక్టులు నుంచి రూ.1.70 కోట్లు జరిమానా వసూలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలపర్ల చేతిలో లేదని.. అంతా కొనుగోలుదారుల చేతిలోనే ఉందని జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి అద్యక్షుడు రంజన్ బండేల్కర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల విషయంలో కొనుగోలుదారుల నుంచి అంతగా ఫిర్యాదులు ఉండటంలేదన్నారు. అయితే, ఈ రంగం మరింత అభివృద్ధి చెందడానికి వీలుగా సంబంధిత శాఖలు, అధికారులను రెరా పరిధిలోకి తీసుకురావాలని సర్కారుకు విన్నవించారు.

కొనుగోలుదారులకు యూపీ రెరా అండా ఉంటున్న తరహాలో తెలంగాణ రెరా ఎప్పుడు అలాంటి చర్యలు చేపడుతుందని పలువురు బ‌య్య‌ర్లు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు ఎన్ని చేస్తున్నా వాటిని బుట్ట‌దాఖ‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణ రెరా అథారిటీలో ఓ మ‌హిళా అధికారి చ‌క్రం తిప్పుతున్నార‌ని స‌మాచారం. అక్ర‌మాలు చేసే ప్ర‌మోట‌ర్ల‌కు అండ‌గా ఉంటున్నార‌ని.. పైఅధికారుల‌కు తెలియ‌కుండా త‌న స్థాయిలోనే డెవ‌ల‌ప‌ర్ల‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీంతో, కొనుగోలుదారుల వివాదాల్ని ప‌రిష్క‌రించ‌కుండా మ‌రుగున ప‌డేలా చేస్తోంద‌ని తెలిసింది. కొనుగోలుదారులకు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ రెరాపై ఉందని.. ఆ దిశగా చర్యలు చేపట్టాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

This website uses cookies.