కరోనా ప్రభావం నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ రంగం కోలుకోవాలంటే రెండేళ్ల సమయం పడుతుంది. 2022–23 ఆర్ధిక సంవత్సరం తర్వాతే కరోనా కంటే ముందు స్థాయికి గృహ విక్రయాలు చేరతాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2021–22లో దేశంలోని ఆరు ప్రధాన నగరాలు బెంగళూరు, ఎన్‌సీఆర్, కోల్‌కతా, పుణే, ముంబై, హైదరాబాద్‌లోని రియల్టీ మార్కెట్ 5–10 శాతం మేర వృద్ధి చెందుతాయని తెలిపింది. అఫర్డబులిటీ లభ్యత, వర్క్ ఫ్రం హోమ్ పెరగడమే డిమాండ్‌కు కారణంమని పేర్కొంది.
గత ఆర్ధిక సంవత్సరంలో (2020–21) పుణే, ముంబై నగరాలలో స్టాంప్ డ్యూటీ తగ్గింపునతో ఆయా నగరాలలో గృహాల డిమాండ్ 5–15 శాతం మేర వృద్ధి చెందిందని.. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో 10–20 శాతం పెరుగుతుందని క్రిసిల్ డైరెక్టర్ ఇషా చౌదరి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, ఎన్‌సీఆర్, కోల్‌కతా నగరాలలో 2020–21 ఎఫ్‌వైలో 25–45 శాతం క్షీణించిన డిమాండ్.. ఈ ఆర్ధిక సంవత్సరంలో (2021–22) 40–45 శాతం మేర పెరుగుతుందని పేర్కొన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ ఆర్ధిక సంవత్సరం తొలి భాగంలో డిమాండ్ క్షీణిస్తుందని.. అయితే గత ఫైనాన్షియల్ ఇయర్ మాదిరిగానే రెండవ భాగంలో ఆరోగ్యకరమైన వృద్ధికి చేరుతుందని అంచనా వేశారు. తక్కువ వడ్డీ రేట్లు, పరిమితమైన ప్రైజ్ కరెక్షన్, స్టాంప్ డ్యూటీ తగ్గింపు (2021 ఎఫ్‌వైలో మహారాష్ట్రలో) కారణంగా గత ఐదేళ్లలో దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో గృహాల డిమాండ్ 30 శాతం మేర వృద్ధి చెందిందని ఏజెన్సీ తెలిపింది.
దేశీయ రియల్టీ పరిశ్రమ కంటే వేగంగా లిస్టెడ్, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. మెరుగైన బ్యాలెన్స్ షీల్స్, క్రెడిట్ ప్రొఫైల్‌ను నిలబెట్టుకుంటున్నాయని క్రిసిల్ తెలిపింది. గత ఆర్ధిక సంవత్సరంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న డెవలపర్ల మార్కెట్ వాటాను 21 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది. గడువులోగా గృహాల నిర్మాణం, డెలివరీ చేయడమే ఇందుకు కారణమని.. ప్రీ–కరోనా కంటే ముందు స్థాయి అమ్మకాలను వేగంగా దాటేశారని తెలిపారు.
గత ఐదేళ్లలో స్థిరమైన డెవలపర్లు ఈక్విటీ, స్థలాలు, కమర్షియల్ ప్రాపర్టీల మానిటైజేషన్‌ల ద్వారా రూ.44 వేల కోట్లు సేకరించారని క్రిసిల్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. కొన్ని రీజినల్ స్థాయి డెవలపర్లు ఉత్తమ క్రెడిట్ ప్రొఫైల్‌ను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మూలధనం కోసం రుణం మీద ఆధారపడే డెవలపర్లు కోవిడ్ కాలంలో మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. రుణం–ఆస్తుల నిష్పత్తి 60 శాతం కంటే ఎక్కువే ఉందని తెలిపారు. పరిమిత స్థాయిలో ద్రవ్య లభ్యత కారణంగా వాణిజ్య ఆస్తులు, ఈక్విటీలతో నిధుల సమీకరణ కష్టంగా మారిందని చెప్పారు.’
This website uses cookies.