Categories: LATEST UPDATES

చెప్పిందేవీ చేయలేదు

  • ప్రాజెక్టు ముందు డెవలపర్ కి వ్యతిరేకంగా ఆందోళన
  • రోడ్డెక్కిన వాటికా ఇండియా నెక్ట్స్ టౌన్ షిప్ నివాసితులు

కొందరు డెవలపర్లు ప్లాట్లు లేదా ఫ్లాట్లు విక్రయించేటప్పుడు కళ్లు చెదిరే బ్రోచర్లతో.. తమ ప్రాజెక్టులో ఇవి కల్పిస్తాం.. ఆ సౌకర్యాలు ఏర్పాటుచేస్తామని చెబుతారు. వాటన్నింటికీ ఆకర్షితులై చాలామంది అందులో ఫ్లాట్లు కొంటారు. తీరా చూస్తే తొలుత చెప్పినదాంట్లో చాలా పనులు చేయకుండా ఇబ్బందులు పెడుతుంటారు. అలాంటివాటిలో గురుగ్రామ్ లోని వాటికా ఇండియా నెక్ట్స్ టౌన్ షిప్ తాజాగా చేరింది. 82, 82ఏ, 83, 84, 85 సెక్టార్లలోని 700 ఎకరాల్లో ఉన్న ఈ టౌన్ షిప్ డెవలపర్.. తమకు చెప్పిన వసతులు ఏర్పాటు చేయలేదంటూ కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. డెవలెపర్ కు వ్యతిరకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సపైర్ మాల్ నుంచి వాటికా సిటీ సెంటర్ వరకు పలువురు సీనియర్ సిటిజన్లు ప్లకార్డులు చేతపట్టుకుని డెవలపర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

కొనుగోలు చేసిన సమయంలో అక్కడ క్లబ్ హౌస్, కమ్యూనిటీ సెంటర్లు, ప్రార్థనా స్థలాలు, సీసీటీవీ కెమెరాలు, శ్మశానవాటిక సైతం నిర్మిస్తానని డెవలపర్ చెప్పాడని.. కానీ ఇప్పుడు వాటిని ఏవీ పూర్తిచేయలేదని పేర్కొన్నారు. 2008 నుంచి 2012 మధ్య పలువురు తమ కష్టార్జితాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారని.. ప్రస్తుతం ప్లాట్ లేదా ఫ్లాట్ ఇవ్వకుండా డబ్బులు వెనక్కి తీసుకోవాలని డెవలపర్ అంటున్నాడని రవి యాదవ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తంచేశారు. గత పది పన్నెండేళ్లుగా సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని.. ప్రాజెక్టు నిర్వహణ కూడా సరిగా లేదని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ ఎల్ సింగ్లా తెలిపారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు.

దీనిపై వాటికా లిమిటెడ్ అధికారి ప్రతినిధిని సంప్రదించగా.. తమ సీనియర్ అధికారులు కొన్ని వారాల క్రితం సీనియర్ సిటిజన్ తరపు ప్రతినిధులను కలిసి అన్ని అంశాలను వివరించారని చెప్పారు. మరోవైపు బాహ్య అభివృద్ధి చార్జీలు చెల్లించని కారణంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గతేడాది ఈ ప్రాజెక్టు లైసెన్స్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కొందరు డెవలపర్లు కళ్లు తెరిచి.. యూడీఎస్, ప్రీ లాంచుల జోలికి వెళ్లకుండా.. సరైన అనుమతితో ప్రాజెక్టుల్ని చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. దానికి తగ్గట్టుగా నిర్మాణాల్ని ప్లాన్ చేయాలని.. లేకుంటే ఇలాగే ఆయా ప్రాజెక్టుల ముందు కొనుగోలుదారులు ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా డెవలపర్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు.

This website uses cookies.