Categories: EXCLUSIVE INTERVIEWS

పుంజుకుంటున్న రియాల్టీ

  • అన్ని వర్గాల నుంచి ఇళ్లకు డిమాండ్
  • కరోనా తర్వాత అన్నీ గాడిన పడుతున్నాయి
  • ప్రజల చెల్లింపు స్తోమత కూడా పెరుగుతోంది
  • తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు

కరోనా కారణంగా గత కొన్నాళ్లుగా కాస్త వెనకబడిన రియల్ రంగం తిరిగి బాగా పుంజుకుందని.. ప్రస్తుతం అన్ని వర్గాల నుంచి ఇళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. గతేడాది కాలంగా మధ్య, అల్పాదాయ ప్రజల ఆదాయం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. అధికాదాయ ప్రజల నుంచి ఇళ్ల డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. మార్కెట్ లోని అన్ని సెగ్మెంట్ల నుంచి డిమాండ్ వస్తోందన్నారు. 2017 నుంచి 2020 మధ్య మధ్య, అల్ప, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు మార్కెట్ పై దృష్టి పెట్టగా.. అధికాదాయ వర్గాల నుంచి మాత్రం ఆ సమయంలో డిమాండ్ తక్కువగా కనిపించిందని వివరించారు. అయితే, గతేడాదిగా ఇందులో మార్పు వచ్చిందని.. ప్రస్తుతం అధికాదాయ వర్గాల నుంచి హౌసింగ్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని చెప్పారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, చెన్నై వంటి నగరాల్లో చక్కని అభివృద్ధి కనపడుతోందని వెల్లడించారు. ఏడాది క్రితం గృహాలకు సంబంధించి తీసుకునే రుణాల సగటు రూ.27 లక్షలు ఉండగా.. ప్రస్తుతం అది రూ.32 లక్షలకు పెరిగిందని తెలిపారు.

దశాబ్ద కాలానికిపైగా పరిస్థితులను పరిశీలిస్తే.. ఇంటి కొనుగోలుకు ఇదే మంచి తరుణమని ప్రభాకర్ రావుపేర్కొన్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయని.. అందులో వడ్డీ రేట్లు ఒక్క అంశం మాత్రమేనని చెప్పారు. ‘గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇది ఒక్క కారణం మాత్రమే. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజల స్తోమత పెరగడమే.2017 నుంచి 2021 మధ్య ప్రజల ఆదాయం 7.5 శాతం నుంచి 8 శాతం మేర పెరిగింది. కరోనా కాలంలో ఇది పెరగకపోయినా.. మొత్తానికి చూస్తే ఈ కాలంలో వారి ఆదాయం పెరిగింది’ అని వివరించారు. పైగా 2017తో పోలిస్తే ప్రాపర్టీ ధరలు అంత ఎక్కువగా లేవని.. వ్యక్తుల వార్షికాదాయంతో పోలిస్తే, అందుబాటులోనే ఉన్నాయని చెప్పారు. ఈ కాలంలో ఒక వ్యక్తి ఆదాయం 30 శాతం నుంచి 32 శాతం పెరిగిందని భావిస్తే.. ప్రాపర్టీ ధరలు మాత్రం స్థిరంగా ఉండటంతో అతడి స్తోమత పెరిగినట్టే కదా అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇళ్లకు డిమాండ్ పెరగడానికి ఇదే కారణమని వివరించారు. ఇక కోవిడ్ వల్ల చాలా కుటుంబాలు పెద్ద, విశాలమైన ఇళ్ల కోసం చూడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం అంతగా లేకపోతే పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తాయని ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. మొదటి రెండు వేవ్ లలో ఇబ్బందులు ఎదుర్కొన్న స్వయం ఉపాధి పొందుతున్నవారి వ్యాపార కార్యకలాపాలు గాడిన పడ్డాయని.. ఫలితంగా వారంతా సాధారణ స్థితికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. వచ్చే మూడునెలల్లో ఆర్థిక వ్యవస్థ, వ్యాపార కార్యకలాపాలు ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉందని.. అప్పుడు వారి చెల్లింపు స్తోమత కూడా క్రమంగా పెరుగుతుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా మళ్లీ గాడిన పడిందని.. త్వరలోనే అంతా సాధారణ స్థితికి చేరుకోవడం ఖాయమని పేర్కొన్నారు.

This website uses cookies.