సర్కారు భూములను అమ్ముతున్నారంటూ పీసీసీ చీఫ్‌గా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక అదే పంథాను కొనసాగిస్తున్నారు. నిన్నటి దాకా రియల్ రంగాన్ని పెద్దగా పట్టించుకోని ప్రభుత్వ వర్గం.. ఇప్పుడు అదే వ్యాపారాన్ని ఆరంభించింది. నిజానికి, ఏడాది కాలంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నది. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూముల (ప్లాట్ల) అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి. ఈ తరుణంలో భూముల అమ్మకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే గచ్చిబౌలిలో 400 ఎకరాలను అమ్మేందుకు టీజీఐఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత హౌసింగ్, దిల్ భూములను అమ్మేందుకు స్కెచ్ వేసింది.
ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంత మేర ఉన్నాయి? అమ్మితే ఎంత ఆదాయం వస్తుంది? అనే విషయాలపై స్పష్టమైన అంచనాకు వచ్చేందుకు ఇటీవల సీఎం, సీనియర్ మంత్రులు వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఇదే ప్రధాన చర్చ జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ మేరకు హౌసింగ్ బోర్డు, దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్), రాజీవ్ స్వగృహ పరిధిలోని భూముల వివరాలన్నీ సీఎంకు చేతికిచ్చారు. సుమారు రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకునేలా ఈ భూములను అమ్మేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు, దిల్, రాజీవ్ స్వగృహ పరిధిలో హైదరాబాద్ లోపల, చుట్టుపక్కలా ఖరీదైన భూములున్నాయి. హౌసింగ్ కింద ప్రస్తుతం సమారు 5 వేల ఎకరాలు ఉండగా, ‘దిల్’కు 1800 ఎకరాలున్నాయి. ఈ రెండు సంస్థల పరిధిలో ఉన్న భూములన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్‌లోనే ఉండటంతో ఒక్కో ఎకరం కోట్లలో ఉంటుంది. వీటితో పాటు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు కూడా ఓపెన్ ప్లాట్లు, టవర్లు కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 650-700 ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటిని విక్రయించి నిధులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.
వైఎస్‌ఆర్ హయాంలో ఇళ్ల నిర్మాణం, జాయింట్ వెంచర్లు, పరిశ్రమల కోసం దిల్ పేరుతో భూముల్ని సేకరించారు. వీటిలో హౌసింగ్ బోర్డు భూముల్ని నాలుగు భాగాలుగా విభజించారు. సెంట్రల్ భాగంలో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. దక్షిణ భాగంలో రంగారెడ్డి, మేడ్చల్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్ ఉంది. ఉత్తర భాగంలో మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ పడమర భాగంలో మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని పలు ప్రాంతాల్ని చేర్చారు. నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కలిపి మొత్తం ఐదు వేల ఎకరాలను సేకరించారు. వీటిలో హౌసింగ్ స్కీమ్ కోసం 4200 ఎకరాలను వినియోగించి, జాయింట్ వెంచర్స్ కోసం 360 ఎకరాలను కేటాయించారు. ఇవి పోనూ హౌసింగ్ కింద 800 ఎకరాలున్నాయి. వీటిలో 120 ఎకరాలకు పైగా వివాదాల్లో ఉండగా, కొంత భూమి ఆక్రమణల్లో ఉంది. వీటిలో అధికంగా నిజామాబాద్ జిల్లాలో 16 ఎకరాలు, గచ్చిబౌలి, రాయదుర్గం పరిధిలో 50 ఎకరాలు, కూకట్‌పల్లిలో 12 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 18 ఎకరాలు, వరంగల్‌లో 8 ఎకరాల మేరకు పలు వివాదాల్లో ఉన్నాయి.
This website uses cookies.