Categories: TOP STORIES

ఇన్వెస్ట‌ర్ల‌కు భ‌రోసా కల్పిస్తున్న సీఎం..

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్ర‌భుత్వం దేశ‌, విదేశీ ఇన్వెస్ట‌ర్ల‌కు స‌రికొత్త భరోసా క‌ల్పిస్తోంది. ప్ర‌ధానంగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌లు జ‌రుపుతూ.. వారి సందేహాల్ని నివృత్తి చేస్తోంది. ఈ క్ర‌మంలో ఒక‌వైపు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, మ‌రోవైపు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు క్ర‌మం త‌ప్ప‌కుండా వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. త‌మ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ను వారికి ప్ర‌త్యేకంగా వివ‌రిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు, ఐటీ సంస్థ‌ల‌కు ప్రోత్సాహాన్ని అందిస్తామ‌ని హామీ ఇస్తున్నారు. దీంతో క్ర‌మ‌క్ర‌మంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం మీద ఇన్వెస్ట‌ర్ల‌కు భ‌రోసా క‌లుగుతోంది. అంటే, ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం మీద ఉన్న అపోహ‌ల‌న్నీ దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ రియ‌ల్ రంగం గాడిలో ప‌డుతోంది.

కొత్త మెట్రో లైన్ల ఏర్పాటు

హైద‌రాబాద్లో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా కొత్త మెట్రో లైన్లు ఉండాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో పెద్ద అంబ‌ర్ పేట్ స‌మీపంలోని తారామ‌తిపేట్ నుంచి నార్సింగి దాకా ఈస్ట్ వెస్ట్ కారిడార్‌ను క‌లుపుతూ మెట్రో లైన్ వేయ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేయ‌మ‌న్నారు. అదేవిధంగా శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్ట్ ప్రాంతం నుండి కందుకూరు వరకు మెట్రో రైలు కనెక్టివిటీని ప్లాన్ చేయాల‌న్నారు. మెట్రో ఫేజ్-III ప్రణాళికలు జేబీఎస్‌ మెట్రో స్టేషన్ నుండి షామీర్‌పేట వరకూ విస్తరించాల‌న్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సిటీ నుంచి మెట్రో ఏర్పాటు చేయ‌మ‌న్నారు. అంతేత‌ప్ప రాయ‌దుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టును వేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేద‌న్నారు.

ఫ్రెండ్లీ ఇండ‌స్ట్రీ పాల‌సీ..

కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ల్లో నూత‌నోత్తేజాన్ని నింపేందుకు.. ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీని తెచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేయ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్రంలో.. అర్బన్ క్లస్టర్ .. రీజనల్ క్లస్టర్ .. సెమీ అర్బన్ క్లస్టర్ .. ఇలా మూడు పద్ధతుల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్స‌హిస్తోంది. తెలంగాణ‌లో పెట్టుబ‌డుల్ని పెట్టేందుకు ముందుకొస్తే కంపెనీల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం అంటోంది. ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఇటీవ‌ల భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన ఆయ‌న.. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమెజాన్ సంస్థ ప్ర‌తినిధుల‌తో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క త‌దిత‌రులు స‌మావేశ‌మ‌య్యారు. 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జ‌పాన్‌, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. వారికి కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌న‌ల‌ను వివ‌రించారు.

ఐటీ కంపెనీల‌తో స‌మావేశం

ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ఇటీవ‌ల వివిధ ఐటీ సంస్థ‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల సందేహాల్ని నివృత్తి చేశారు. శంషాబాద్ లోని ఆదానీ డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ సెంటర్ లో భారతీయ నేవీ కోసం ఆదానీ సంస్థ దేశీయంగా తయారు చేసిన ద్రిష్టి 10 స్టార్ లైనర్ అన్ మానవరహిత ఏరియల్ వాహనం (యూఏవీ) ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఎయిరో స్పేస్, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల రంగానికి తెలంగాణ ముఖ్యమైన కేంద్రమని తెలిపారు. ఎయిరోస్పేస్ తయారి, సర్వీసింగ్, ఇంజనీరింగ్, శిక్షణ సంస్థలను నెలకొల్పడానికి రాష్ట్రంలో అనేక ఎయిరో స్పేస్, అనుబంధ పార్కులు ఉన్నాయని తెలిపారు.

This website uses cookies.