Categories: LATEST UPDATES

అమరావతిలో పెరుగుతున్న భూమి ధరలు?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల ధరల పెరుగదలలో మార్పు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇక్కడి భూముల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాతే ఈ మార్పు వచ్చినట్టు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ఓటమితో ఇక్కడి రియల్టర్లలో కొంతవరకు ఆందోళన కలిగిన అంశం వాస్తవమే. రియల్ రంగానికి బీఆర్ఎస్ ఇచ్చినంత సపోర్ట్ కొత్త ప్రభుత్వం ఇస్తుందా అని కొంతమంది సందేహించారు. అయితే, రియల్ ఎస్టేట్ నేపథ్యం కలిగిన రేవంత్ రెడ్డి.. తాను నగరాన్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నానో ఎన్నికల ప్రచారంలో వివరించారు.  దీంతో పలువురు రియల్టర్లు.. నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఢోకా లేదనే అభిప్రాయాలు వ్యక్తంచేశారు. అయితే, ఇదే సమయంలో అమరావతిలో భూముల ధరల్లో కదలికలు వస్తున్నాయని.. ఇటీవల కాలంలో ఇక్కడి భూముల రేట్ల గురించి ఎంక్వైరీ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అమరావతి రియల్టర్లు చెబుతున్నారు.

వాస్తవానికి ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో భూముల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అక్కడ పెట్టుబడులు పెట్టినవారిలో చాలామంది వాటిని అమ్మేసుకుని హైదరాబాద్ వైపు మొగ్గు చూపించడంతో ఇక్కడి రియల్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. అమరావతి స్తబ్దుగా ఉండిపోయింది. అలాంటిది ఇప్పుడు అక్కడ భూముల ధరలు క్రమంగా పెరుగుతున్నాయని.. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరగ్గా, మాస్టర్ ప్లాన్ లో కీలకమైన ప్రభుత్వ సంస్థలు వచ్చే చోట్ల దాదాపు 50 శాతం వరకు పెరిగినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ తోపాటు బెంగళూరు, అమెరికాల్లో ఉంటున్నవారే ఎక్కువగా ఇక్కడి భూముల ధరల గురించి ఆరా తీస్తున్నారని వెల్లడించారు. మొత్తానికి అమరావతికి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని అక్కడి రియల్టర్లు సంబరపడుతున్నారు.

This website uses cookies.