Categories: TOP STORIES

జంట రిజ‌ర్వాయ‌ర్లను ఎలా ప‌రిర‌క్షించాలి?

  • సైంటిస్టుల సంయుక్త నివేదిక..
  • ఆ రిజర్వాయర్లకు రక్షణ కల్పించేనా?

జంటనగరాల దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను రక్షణ కోసమే ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవో జారీ చేసింది. ఈ రిజర్వాయర్ల నుంచి 10 కిలోమీటర్ల క్యాచ్ మెంట్ బఫర్ ఏరియాలో కాలుష్య కారక పరిశ్రమలు, ఇతరత్రా నిర్మాణాలను నిషేధించడమే కాకుండా వ్యవసాయం, ఉద్యానవనాలు, పూల మొక్కల పెంపకాన్ని అనుమతిస్తుంది. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించి సాగును బలోపేతం చేయాల్సిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా జీవో 111ని ఎత్తివేయడం ద్వారా ఆ ప్రాంతాల్లో అంతకుముందు నిషేధించిన అన్ని కార్యకలాపాలకూ అనుమతించింది. జీవో 111ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 69.. జంట జలాశయాలకు మరణ శాసనంగా మారింది. దీనివల్ల 84 గ్రామాల్లోని 1,32,000 ఎకరాల్లో 10 కిలోమీటర్ల బఫర్ జోన్లో పరిశ్రమలు, భవనాలు, హోటళ్లు, మాల్స్ మొదలైన అన్ని నిషేధిత కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేసింది.

హైదరాబాద్ లో చిన్నపాటి వాన కురిసినా పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ దీనిపై సర్కారు ఎప్పుడూ నోరు విప్పదు. ఇష్టారాజ్యంగా చేసిన ఆక్రమణల వల్ల వాన నీరు సరైన దిశలో ప్రవహించడానికి వీలు లేకపోవడంతో ఎక్కడికక్కడ నగరం ముంపు బారిన పడుతోంది. అయినప్పటికీ జీవో 111ని ఎత్తివేయడం ద్వారా అటు ఆ ప్రాంతాలను ముంపులోకి నెట్టడమే కాకుండా జంట జలాశయాలు కాలుష్యం బారిన పడే ప్రమాదానికి గేట్లు తెరిచినట్టయింది. ఈ నేపథ్యంలో జీవో 111 రద్దుతో కలిగే పరిణామాలు, పర్యావరణానికి కలుగుతున్న విఘాతం, వివిధ దేశాల్లో జరిగిన పరిణామాలు, రైతులు పరిస్థితి, వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే అంశంపై ప్రముఖ పర్యావరణవేత్త లుబ్నా సర్వత్ ఆధ్వర్యంలో పర్యావరణవేత్తలు డాక్టర్ కె.బాబూరావు, సాగర్ ధారా, డాక్టర్ బి.రామలింగేశ్వర్ రావు రూపొందించిన 129 పేజీల పీపుల్స్ సైంటిఫిక్ కమిటీ రిపోర్టును తాజాగా విడుదల చేశారు. ఇందులోని ముఖ్యమైన అంశాలివీ..

  • ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను హక్కులు, బాధ్యతలతో కూడిన జీవులుగా గుర్తించాలి. శాసన చట్టం లేదా ప్రభుత్వ తీర్మానం ద్వారా దీనిని చేయొచ్చు. రిజర్వాయర్లు, పరీవాహక ప్రాంతాల హక్కులు, బాధ్యతలను చట్టంలో నిర్వచించాల్సి ఉంటుంది. వీటిని అమలు చేయడానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
  • జీవో 111 ప్రాంతంలో రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం కార్బన్ సీక్వెస్ట్రేషన్ పరిహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఈ కార్యక్రమం కింద రైతులు, వ్యవసాయ కార్మికులకు వారి మట్టిలో సీవో2ని సీక్వెస్టర్ చేయడానికి ఎకరానికి రుసుం చెల్లించాలి. హైదరాబాద్ నగరం కాలుష్యం కారణంగా పంట దిగుబడి నష్టాలను చవిచూస్తన్న రైతులు, వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయొచ్చు.
  • ట్రిపుల్ వన్ ప్రాంతంలో సామాజిక సేవల కోసం నిర్దిష్ట బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం కేటాయించాలి. ఈ నిధుల పంపిణీని పర్యవేక్షించడానికి, ఈ ప్రాంతంలోని నివాసితులందరికీ సామాజిక సేవలు సమానంగా అందేలా చూసుకోవడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయాలి.
  • జీవో 111 ప్రాంతంలో ఇప్పటికే ఉన్న, భవిష్యత్తు కార్యకలాపాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగితే వాటిపై తగిన చర్యలు తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేయాలి.
  • జీవో 111 ప్రాంతంలో ప్రస్తుత భూ వినియోగాన్ని స్తంభింపచేస్తూ సర్కారు జీవో జారీ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు, వాటి పరీవాహక ప్రాంతాలకు హాని కలిగించే కార్యకలాపాలను నిరోధించే అవకాశం ఉంటుంది. జలాశయాల్లోకి మురుగు, ఘన వ్యర్థాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ట్రిపుల్ వన్ జీవోకు అనుగుణంగా లేని నివాసాలను, వ్యర్థాలను గుర్తించి, తొలగించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
  • ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను పరిశీలించి, డ్యామ్ పగిలిపోయే పరిస్థితులు ఉన్నచోట నిబంధనలకు అనుగుణంగా దానిని బలోపేతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలి.
  • జంట జలాశయాల్లోని పూడిక తీయించాలి. రిజర్వాయర్ల లోపల ఏమైనా ఆక్రమణలు ఉంటే తొలగించాలి. ట్రిపుల్ వన్ జీవోకి అనుగుణంగా లేని నిర్మాణాలను తొలగించాలి. ఇలా చేయడం వల్ల అటు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని పెరగడమే కాకుండా వరద ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
  • ట్రిపుల్ వన్ ప్రాంతంలో రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఇలా రసాయన రహిత వ్యవసాయం చేసే రైతులకు రాయితీలు, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అలాగే వారి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి కూడా సహకరించాలి.
  • చెరువులు, రిజర్వాయర్లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ప్రత్యేక సర్వే నెంబర్లు ఏర్పాటు చేయాలి. జంట జలాశయాలకు చట్టపరంగా ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి.
  • హైదరాబాద్ నగరం మరింతగా అభివృద్ధి చెందితే పర్యావరణపరంగా, ఆర్థికంగా, సామాజికంగా జీవన నాణ్యత క్షీణిస్తుంది. పెద్దది నుంచి అందమైన చిన్నదిగా మారితే బోలెడు సమస్యలు పరిష్కారమవుతాయి.
  • ట్రిపుల్ వన్ ప్రాంతంలో అవసరమైన చోట్ల వాటర్ షెడ్ మేనేజ్ మెంట్, ల్యాండ్ షేపింగ్, వాయు కాలుష్యాన్ని నిరోధించడం, సౌరశక్తి పార్కుల ఏర్పాటు వంటివి చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ నివేదికను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలి.

This website uses cookies.