రియల్ ఎస్టేట్ లో పాక్షిక యాజమాన్యాన్ని అందించే అన్ని వెబ్ ఆధారిత ప్లాట్ ఫారమ్ లను నియంత్రించడానికి మార్కెట్ల పర్యవేక్షణ సంస్థ సెబీ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. చిన్న పెట్టుబడిదారులను రక్షించే ఉద్దేశంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. పాక్షిక యాజమాన్యం అనేది రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో చిన్న పెట్టుబడి హోల్డింగులు కలిగి ఉంటుంది. ఇలాంటి పాక్షిక యాజమాన్యాన్ని అందించే పలు వెబ్ ఆధారిత వెబ్ సైట్లు వెల్లువలా పుట్టుకొచ్చాయి. మాల్స్, భవనాలు, గొడౌన్ల వంటి వాటిలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ఇవి ఉపకరిస్తాయి. ఇక్కడ కనీసం పెట్టుబడి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉంటుంది. అయితే, ఇందులో మోసాలు జరిగే అవకాశం ఉందని సెబీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్లాట్ ఫారమ్ లను మైక్రో, స్మాల్, మీడియం ఆర్ఈఐటీల కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ కింద నమోదు చేయాలని సెబీ ప్రతిపాదించింది. దీని ప్రకారం ఆర్ఈఐటీ నిబంధనల కింద వీటిని ఎంఎస్ఎం ఆర్ఈఐటీలుగా లేబుల్ చేయడం ద్వారా నియంత్రణ పరిధిలోకి సెబీ ప్రతిపాదించింది. ఎంఎస్ఎం ఆర్ఈఐటీలో ట్రస్టీ, స్పాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్ వంటి పార్టీలు ఉండాలి. అలాంటి ప్రతి వ్యక్తి ప్రత్యేక, విభిన్నమైన సంస్థగా ఉండాలి. స్పాన్సర్ రూ.20 కోట్లు, ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్ రూ.10 కోట్ల నికర విలువ కలిగి ఉండాలని పేర్కొంది.