- రియల్ ఎస్టేట్ గురుతో నటి సీరత్ కపూర్
‘నా కలల సౌథం మా అమ్మ ఆకాంక్షలు అన్నీ నెరవేర్చేది అయితే, నా వరకు అంతకు మించిన విలాసవంతమైన ఇల్లు మరొకటి ఉండదు’ – ఇదీ నటి సీరత్ కపూర్ కోరిక. తన తల్లి కోరికలను తీర్చే ఇల్లే తనకు కావాలని ఆమె స్పష్టం చేశారు. తన ఇల్లు ఎలా ఉండాలనే అంశపై ఆమె రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
‘నేను చాలా ప్రతిష్టాత్మకమైన అమ్మాయిని. ఏదైనా సాహసం గురించి చెప్పండి. నేను అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటాను. నా ఇంటిని అందంగా మార్చే అందమైన పురాతన వస్తువులపై నాకు మక్కువ ఎక్కువ. మా అమ్మ ఎయిరిండియాలో పని చేసేది. మా ఇరుగుపొరుగు వారిలో చాలామంది ఆ సంస్థ సిబ్బందే. ఫలితంగా మా జీవనశైలి వైవిధ్యభరితంగా సాగింది. దాని గురించి మాట్లాడాలంటే చాలానే ఉంటుంది. నేను ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులందరి తో సన్నిహితంగా ఉంటాను. వారు నన్ను ఎంతో బాగా చూసుకుంటారు.
నేను దేశంలో ఎక్కడున్నా వారిని మరచిపోయే ప్రసక్తే ఉండదు’ అని సీరత్ తెలిపారు. చక్కని సీలింగులు, అంతమైన కేబినెట్ లు, రంగురంగుల గోడలు.. ఇవన్నీ సీరత్ కోరుకునేవేనా అని అడగ్గా.. ‘నా కలల సౌథం పురాతన వస్తువులతో నిండి ఉంటుంది. నేను పెరుగుతున్న కొద్దీ ఈ ఆకాంక్ష కూడా బలీయంగా పెరిగింది. చిన్నతనం నుంచీ కళ నన్ను బాగా ఆకర్షించింది. అదే సమయంలో నేను ఇప్పుడు యవ్వన అభిరుచి కలిగిన యువతి కూడా. అందువల్ల నన్ను ఈ రెండు ప్రపంచాల సమ్మిళితంగా అభివర్ణించవచ్చు. ఇక నా కలల ఇంట్లో కొరియన్ స్పేస్ ఉండటాన్ని ఇష్టపడతాను. నిజానికి ఇంటీరియర్స్ కంటే ఎనర్జీలే నాకు ముఖ్యం. ఈ శక్తులు నా పనికి, జీవితంలో ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అందువల్ల ఈ విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను’ అని వివరించారు.
పురాతన వస్తువులుండాలి
సీరత్ తన కలల ఇంటి గురించి మరిన్ని సంగతులు చెబుతూ.. ‘చాలామంది వ్యక్తులు ఇంటీరియర్స్ తో అద్భుతాలు చేయగలరు. అయితే, ఇంటి పునాది, నిర్మాణం అద్భుతంగా ఉంటే మీ ఆనందం డబుల్ కావడం ఖాయం. ఆర్కిటెక్ట్ జియోఫ్రీ బావా శైలులు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఇండోర్ తో ఔట్ డోర్ లను నింపాలని ఆయన దృష్టి ప్రకృతితో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. అంతే కాకుండా ఆయన ప్రత్యేకమైన డిజైన్లు చక్కని అనుభూతినిస్తాయి. ఇంటి నిర్మాణం కూడా ఎంతో ముఖ్యమైనది. ఇంకా నేను ఆయన సున్నితత్వాలకు వీరాభిమానిని’ అని చెప్పారు. మన్నికైన ఫర్నిచర్ ఒక్కటే కాకుండా పురాతన వస్తువులు ఉండాలనేది ఈ భామ కల.
ఇంకా ఆమె తన ఆకాంక్షల గురించి చెబుతూ.. ‘ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలనే విషయాన్ని వదిలిపెట్టండి. నేను ఎల్లప్పుడూ నా తల్లి దగ్గరే ఉండాలనుకుంటాను. నా చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను. నిజానికి నా కలల నివాసం కంటే నా తల్లికి సౌకర్యవంతమైన, విలాసవంతమైన ప్రదేశం కావాలని కోరుకుంటాను. అలాంటి చోటే తను నాతో ఆనందకరమైన మధురానుభూతులు సృష్టించగలదు. సమస్త సౌకర్యాలూ కలిగిన ఇంట్లో ఆమె నివసించాలన్నదే నా అభిలాష.
ఆమె ఇందుకు పూర్తి అర్హురాలు కూడా. ఎలాంటి ఒత్తిడీ లేని, తనకు అనుగుణంగా ఉండే ఇల్లు ఆమెకు కచ్చితంగా కావాలి. ఆమె ఓ స్వతంత్ర మహిళ. ఇద్దరు పిల్లలను పెంచుతోంది. పైగా మేం సృజనాత్మక రంగాల్లో ఉన్నాం. ఆమె మా కోసం చాలా త్యాగం చేసింది. నా డ్రీమ్ హోం తొలుత మా అమ్మ కోరికలు తీర్చేదిగా ఉండాలి. అది వన్ బీహెచ్ కే అయినా సరే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఆమెకు అంతకుమించి ఇవ్వడానికి నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ముంబైలో ఓ విల్లా కొనుగోలు చేయగలనని అనుకుంటున్నాను‘ అని పేర్కొన్నారు.
నిశబ్దంగా.. ఒంటరిగా..
సీరత్ కపూర్ డ్రీమ్ హోమ్ కు సంబంధించి ఇంకా చాలా అంశాలున్నాయి. ‘బీచ్ లు, నీళ్లతో ఉండే ప్రదేశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చుట్టూ పెద్దపెద్ద చెట్లు, అందంగా కనిపించే ఆకాశంతో కూడిన ప్రదేశంలో నివసించడం మన జీవితానికి కొత్త అర్థాన్ని తెస్తుంది. చిందరవందరగా ఉండే ప్రదేశం కంటే బహిరంగంగా ఉండే ప్రదేశం మనకు మనశ్వాంతిని ఇస్తుంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
షూటింగ్ లేని సమయంలో విల్లాలో అత్యంత నిశ్శబ్దంగా ఉండే చోట ఎక్కువ సమయం గడపడాన్ని సీరత్ ఎంజాయ్ చేస్తారు. నిజానికి ఆమె భారీగా ఉండే గదులను ఇష్టపడినప్పటికీ, తన ఇష్టంగా ఉండే ఓ మూలన గడపడానికే ప్రాధాన్యత ఇస్తారు. ‘ముంబైలో పెద్ద లాన్ కలిగి ఉండటం విలాసవంతమైన విషయం. ఇంకా నేను వాస్తును కూడా నమ్ముతాను. అయితే, అదే సమయంలో మొత్తం ఇంటిని వాస్తు ముసుగులో మార్చాలని భావించను. కానీ మీ సొంత ఇంటిని నిర్మించేటప్పుడు ఇది తప్పకుండా కాస్త ప్రాముఖ్యతను కలిగి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంకా ఇంట్లో కొలను ఉండటం వల్ల ఎలాంటి హానీ జరగదు. పైగా నాకు నీళ్లంటే చాలా ఇష్టం’ అని తెలిపారు.
సాఫ్ట్ లైటింగ్, షీర్ కర్టెన్లు నన్ను నిర్వచిస్తాయి. హైదరాబాద్ లో నా స్నేహితులందరూ తమ ఇళ్లను చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. స్థలం విషయంలో ఎవరూ రాజీపడలేదు. అయినప్పటికీ, నేను మా నాన్న ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా చాలా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా నేను నా టాలీవుడ్ స్నేహితులతో చర్చించాను. చెట్లతో కూడిన అద్భుతమైన సముద్ర వీక్షణ అందరికీ నచ్చుతుంది’ అని సీరత్ వెల్లడించారు.