Categories: TOP STORIES

సింగిల్ బీహెచ్ కే సో బెటరూ

  • బెంగళూరులో పెరుగుతున్న అద్దెలతో చిన్న ఫ్లాట్లకే డిమాండ్
  • డెవలపర్లు సైతం వాటి నిర్మాణానికే మొగ్గు

ఐటీ నగరం బెంగళూరులో అద్దెలు చుక్కలను తాకుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మంచి ఇక్కడ అద్దెలు ఉంటున్నాయి. హెచ్ఎస్ఆర్ లేఔట్ లో 400 చదరపు అడుగుల సెమీ ఫర్నిష్ట్ సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ అద్దె రూ.35వేలు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో చాలామంది ఇప్పుడు సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లనే ఎంచుకుంటున్నారు. అద్దె భారం తప్పించుకునేందుకు చిన్న ఇంట్లోనే సర్దుకుపోదాం అనే ధోరణిలో ఉంటున్నారు.

బెంగళూరు నగర కేంద్రం, ఐటీ కారిడార్లలో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే విద్యార్థులు, వర్క్ ప్లేస్ కు దగ్గరగా మకాం మార్చే యువ నిపుణులు వీటి వైపే మొగ్గు చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ యూనిట్లకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ, డెవలపర్లు వీటిని గత రెండేళ్లుగా తగ్గిస్తూనే వచ్చారు. అయితే, తుది వినియోగదారులు, పెట్టుబడిదారులను ఇవి ఆకర్షిస్తూనే ఉన్నాయి. స్థిరమైన అద్దె డిమాండ్, అద్దె దిగుబడి 5 శాతం కంటే ఎక్కువ ఉండటంతో 1 బీహెచ్ కేలు మంచి ఎంపికగా మారాయి.

పదేళ్ల క్రితం బెంగళూరులో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లు చాలా తక్కువగా ఉండేవి. ఉన్నవి కూడా కాస్త విశాలంగానే ఉండేవి. ప్రస్తుతం ఈ ట్రెండ్ మారింది. క్రమేణా వీటి విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. 2023లో 1 బీహెచ్ కే సగటు కార్పెట్ ఏరియా 380 చదరపు అడుగులు ఉండగా.. 2024లో అది 350 చదరపు అడుగులకు పడిపోయింది. అద్దె రాబడి దృష్ట్యా 2 బీహెచ్ కే కంటే 1 బీహెచ్ కే లాభదాయకంగా ఉంది. సాధారణంగా 2 బీహెచ్ కే ఫ్లాట్ కు నెలకు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు అద్దె ఉంటుంది. అయితే, అదే 2 బీహెచ్ కేని రెండు వేర్వేరు 1 బీహెచ్ కేగా మారిస్తే.. యూనిట్ కు కనీసం రూ.20వేల అద్దె వస్తుంది. అంటే ప్రతి యూనిట్ కార్పెట్ ప్రాంతం తగ్గుతుంది. ఆదాయం మాత్రం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో భూమి వినియోగాన్ని పెంచడానికి డెవలపర్లు ఈ దిశగా ప్రణాళికులు వేస్తున్నారు.
రెండేళ్ల క్రితం బెంగళూరులో కొత్త 1 బీహెచ్ కే అపార్ట్ మెంట్ల పరిమాణం సాధారణంగా 650-700 చదరపు అడుగుల మధ్య ఉండేది. కొన్ని 1,000 చదరపు అడుగులకు కూడా ఉండేవి. అయితే, గ్రేడ్ ఏ బిల్డర్ల ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు 550-650 చదరపు అడుగుల మధ్య 1 బీహెచ్ కేలను అందిస్తున్నాయి. అదే సమయంలో స్వతంత్ర బిల్డర్ అంతస్తులలో 350-400 చదరపు అడుగుల చిన్న 1 బీహెచ్ కే అపార్ట్ మెంట్‌లు ఉంటున్నాయి. ప్రస్తుతం, బెంగళూరు అంతటా గేటెడ్ ప్రాజెక్టుల్లో ఉన్న అన్ని ఇన్వెంటరీలలో 1 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు దాదాపు 10-15% ఉన్నాయి.

This website uses cookies.