Categories: EXCLUSIVE INTERVIEWS

హైదరాబాద్ రియాల్టీ ఆశాజనకం.. క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్ రెడ్డి.

కొవిడ్ మహమ్మారితో సంబంధం లేకుండా హైదరాబాద్ రియల్ రంగం ఆశాజనకంగా మారిందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ జనరల్‌ సెక్రటరీ వి రాజశేఖర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రెడాయ్‌ హైదరాబాద్‌ ( Credai Hyderabad ) వద్ద నూతన బృందం, వృద్ధి విభాగాలను గుర్తించడంపై దృష్టి సారిస్తుందన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..

‘‘ప్రభుత్వంతో అతి సన్నిహితంగా పని చేస్తూ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగ అభివృద్ధికి సహాయపడటంతో పాటుగా ఇతరులు సైతం అనుసరించేలా ఓ నమూనా తీర్చిదిద్దుతాం. గత కొద్ది సంవత్సరాలుగా, డిమాండ్‌కు అనుగుణంగా మా వ్యాపార ప్రణాళికలను స్వీకరించాం. అత్యాధునిక టెక్నిక్స్‌, అత్యుత్తమ ప్రక్రియలు సైతం స్వీకరించి సామాన్య ప్రజలకు సైతం చేరువయ్యేలా ప్రత్యేక ప్రాజెక్ట్‌లను తీసుకువచ్చాం. సంవత్సరాల పాటు కష్టపడిన తరువాత ఇప్పుడు నగరంలో రియల్‌ ఎస్టేట్‌ ఆశాజనకంగా ఉంది.

నివేదికల ప్రకారం, ఈ సంవత్సర తొలి త్రైమాసంలో అమ్మకాల పరంగా 39% వృద్ధిని నమోదు చేయడంతో పాటుగా అమ్ముడుకాకున్నా ఉన్నా ఆస్తుల పరంగా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో అతి తక్కువగా ఉన్న నగరంగానూ ఖ్యాతి గడించింది. తొలి త్రైమాసంలో దేశంలో ప్రారంభమైన నూతన ప్రాజెక్టులలో 30% హైదరాబాద్‌ నగరంలోనే జరిగాయి. అమ్మకాలు వేగవంతం అయ్యేందుకు రిజిస్ట్రేషన్‌ చార్జీలో ఉపశమనం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని అన్నారు.

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఐటీ మరియు పారిశ్రామిక నివేదిక ప్రకారం నగరం నుంచి ఎగుమతులు 12.98% వృద్ధి చెందాయి మరియు ఉపాధి పరంగా గత ఆర్థిక సంవత్సరంలో 8% వృద్ధి నమోదైంది. జాతీయ సరాసరితో పోలిస్తే ఇది రెట్టింపు. ఈ నగరం ఇప్పుడు పలు అంతర్జాతీయ సంస్ధల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మూడు డాటా కేంద్రాల కోసం ఏడబ్ల్యుఎస్‌; లెగటో మరియు క్వాల్‌కామ్‌లు ముందస్తులీజు ఒప్పందాలు (1.8 మిలియన్‌ చదరపు అడుగుల కోసం) మరియు వెల్స్‌ ఫార్గో మరియు జెన్‌ప్యాక్ట్‌ కోసం ప్రణాళికలో ఉన్న ప్రాజెక్టులతో పాటుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు (1.4 మిలియన్‌ చదరపుఅడుగులు) వంటివి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో టీఎస్‌ఐఐసీ 10 పారిశ్రామిక పార్కులతో 810 ఎకరాలను 453 పారిశ్రామిక ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా అభివృద్ధి చేసింది.

This website uses cookies.