కొత్తగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన బిల్డర్లు.. ప్రీలాంచ్ ప్రచారాన్ని చేస్తున్నారంటే.. కొంతమేరకు క్షమించి వదిలి వేయవచ్చు. కానీ, హైదరాబాద్‌లో పీబీఈఎల్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీలో పాలుపంచుకున్న ఇన్‌కార్ సంస్థ.. సోషల్ మీడియాలో ప్రీలాంచ్ ప్రకటనల్ని గుప్పించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టీఎస్ రెరా అనుమతి లేకుండా ప్రీలాంచ్‌లో ఫ్లాట్లు లేదా విల్లాల్ని కట్టొద్దన్న సంగతి తెలిసి కూడా.. శంకర్‌పల్లికి చేరువలో ప్రీలాంచ్‌లో విల్లాల్ని విక్రయిస్తోందంటే.. ఈ సంస్థ ధైర్యాన్ని చూసి మెచ్చుకోవాలి. గతంలో పటాన్‌చెరులో ఒక అపార్టుమెంట్ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఇన్‌కార్ సంస్థ ఇలాగే ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించింది. కాకపోతే, అప్పట్లో రెరా శాశ్వత ఛైర్మన్‌ను ప్రభుత్వం నియమించకపోవడంతో దొరక్కుండా తప్పించుకున్నాడు. మరి, ఇప్పటి రెరా ఛైర్మన్ ఇన్‌కార్ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూస్తే తెలుస్తుంది.
శంకర్‌పల్లి దాటిన తర్వాత వికారాబాద్ వెళ్లే రోడ్డులోని మెహతాబ్ ఖాన్ గూడలో.. సండే మార్నింగ్ అంటూ యాభై ఒక్క ఎకరాల్లో 185 విల్లాల ప్రాజెక్టుకు ఇన్‌కార్ శ్రీకారం చుట్టింది. తొలుత 600 మరియు 720 గజాల విసీర్ణంలో విల్లాల్ని నిర్మిస్తున్నామంటూ ప్రకటించింది. ఒక్కో విల్లా సైజు 5400 మరియు 6500 చదరపు అడుగుల్లో జి ప్లస్ 2 అంతస్తుల ఎత్తులో డిజైన్ చేసింది. ఆరంభ ధర సుమారు రూ.3.5 కోట్లు అని సంస్థ సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. రెరా నిబంధనల ప్రకారం.. ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను టీఎస్ రెరా విధించాలి. మరి, ఈ ప్రీలాంచ్ ప్రాజెక్టుపై రెరా అథారిటీ ఎంత జరిమానాను విధిస్తుందోనని రియల్ రంగం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. క్రెడాయ్ హైదరాబాద్ నిర్మాణ సంఘంలో సభ్యుడిగా ముందునుంచీ కొనసాగుతున్న ఇన్‌కార్ సంస్థ ఎండీకి.. రెరా అనుమతి లేకుండా ప్రీలాంచులు చేయకూడదనే సంగతి తెలియదా?
ప్రభుత్వం అనుమతుల్లేకుండా నిర్మాణాల్ని ఆరంభించమంటూ ప్రతి క్రెడాయ్ బిల్డర్.. కోడ్ ఆఫ్ కండక్ట్ మీద సంతకం పెట్టిన తర్వాతే సభ్యత్వాన్ని తీసుకుంటారు. ప్రతిఒక్కరూ ఈ నిబంధనను తప్పకుండా పాటించాల్సిందే. అదేంటో తెలియదు కానీ, హైదరాబాద్‌లో పలువురు క్రెడాయ్ బిల్డర్లు ఈ నిబంధనను అస్సలు పట్టించుకోవట్లేదు. తోటి బిల్డర్లు ప్రీలాంచుల్ని చేస్తున్నా క్రెడాయ్ హైదరాబాద్ సంఘం కూడా ఎంతో లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ప్రజల్లో క్రెడాయ్ బ్రాండ్ ఇమేజ్‌కి తూట్లు పడుతోంది. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో క్రెడాయ్ బిల్డర్ అంటే కొనుగోలుదారులు నమ్మే పరిస్థితి ఉండదు. క్రెడాయ్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లినా ఫర్వాలేదంటే ఎవరేం చేయలేరు. కాకపోతే, క్రెడాయ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదంటే మాత్రం.. నిర్మాణ సంఘం తక్షణమే ఈ అంశంపై చర్చించి.. ప్రీలాంచ్, యూడీఎస్, బై బ్యాక్ ఆఫర్‌లపై ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే, కొత్త ప్రభుత్వం ముందు క్రెడాయ్ విలువ కూడా పోయే ప్రమాదముంది.
This website uses cookies.