Categories: LEGAL

ట్విన్ టవర్లు కూల్చివేయండి : సుప్రీం కోర్టు

వెయ్యి ఫ్లాట్లను కట్టిన ట్విన్ టవర్లను మూడు నెలల్లో కూల్చివేయాలని.. అందులో ఫ్లాట్లు కొన్నవారికి 12 శాతం వడ్డీతో సహా సొమ్ము వాపసివ్వాలని సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చింది. నొయిడాలో సూపర్ టెక్ సంస్థ నిర్మించిన అపెక్స్, సీయేన్ టవర్లను నేలమట్టం చేయాలని అలహాబాద్ హై కోర్టు 2014లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సూపర్ టెక్ సంస్థ, నొయిడా అథారిటీలు కలిసి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు పలు సంచలన వ్యాఖ్యల్ని చేసింది.

పర్యావరణానికి నష్టం కలిగించే నిర్మాణాల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని దేశ అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది. నగరాల్లో భూముల విలువలు అధికమైన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని.. డెవలపర్లు, ప్రణాళికా అధికారులు కుమ్మక్కయితే ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని వ్యాఖ్యానించింది. స్థల కేటాయింపు, నిర్మాణానికి అనుమతి, ప్లాన్ ప్రకారమే స్ట్రక్చర్ నిర్మాణం జరుగుతుందో లేదో అనే అంశంపై తనిఖీ, వివిధ విభాగాల నుంచి అనుమతులు, కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేయడం వంటివన్నీ నిబంధనల ప్రకారం ప్రతిదశలో పక్కాగా జరగాలని ధర్మాసనం తెలిపింది.

మెట్రో నగరాల్లో ప్రజలకు ఆవాసం అందించాల్సిందే. కాకపోతే పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు అందులో నివసించేవారు సురక్షితంగా ఉండాలని 140 పేజీల తీర్పులో తెలియజేసింది. పర్యావరణానికి ప్రతికూలంగా మారే నిర్మాణాల్ని అనుమతించకుండా నియంత్రణ ఉండాలని జస్టీస్ చండ్రచూడ్ తెలిపారు. నియంత్రణ అధికారుల సహకారం లేకుండా డెవలపర్లు నిర్లక్ష్య ధోరణీతో నిబంధనల్ని ఉల్లంఘిస్తే పట్టణ ప్రణాళిక ప్రశ్నార్థకంగా మారుతుందని క‌ఠినంగా వ్యాఖ్యానించింది. దీని వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, భద్రతా ప్రమాణాల్లో రాజీ పడాల్సి వస్తుందని.. అందుకే, అక్రమ నిర్మాణాల వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించాలని తెలియజేసింది. కాకపోతే బిల్డర్లు, ప్రణాళికా అధికారులు కుమ్మక్కు అవ్వడం వల్ల అమాయక కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారని.. వారి నాణ్యమైన జీవనానికి నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువ ఉందని తెలియజేసింది. ఆర్థికంగా పరిపుష్ఠి కలిగిన డెవలపర్లు, ప్రణాళికా అధికారుల చట్టపరమైన అధికారం యొక్క శక్తితో హక్కుల కోసం సుదీర్ఘమైన మరియు ఖరీదైన పోరాటం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. నోయిడాలోని సూపర్‌టెక్ ద్వారా మూడు నెలల్లోపు 1000 ఫ్లాట్‌లతో జంట టవర్లను కూల్చివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, జంట టవర్లలో ఫ్లాట్‌లను బుక్ చేసుకున్న గృహ కొనుగోలుదారులందరికీ 12 శాతం వడ్డీతో రియల్ ఎస్టేట్ సంస్థ డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

This website uses cookies.