హైదరాబాద్ రియాల్టీలో గత ఏడాది నుంచి అమ్మకాలు పెద్దగా లేవు. ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులు చేస్తున్న బిల్డర్లలో కొందరు.. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. సేల్స్ లేకపోవడంతో నగదు కొరత వీరిని తీవ్రంగా వేధిస్తోంది. అయినా, పలువురు డెవలపర్లు తమ అనుభవాన్ని రంగరించి.. సమస్యను అధిగమించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరైతే ప్రాజెక్టులో అధిక సమయాన్ని కేటాయిస్తూ.. నిర్మాణ పనుల్ని నిశితంగా పరిశీలిస్తూ.. ఈ గండం నుంచి బయటపడేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు గతంలో రెండుసార్లు ఎదురయ్యాయని పలువురు బిల్డర్లు చెబుతున్నారు.
సత్యం కుంభకోణం, అమెరికా సబ్‌ప్రైమ్ సమస్య, ఆతర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంలో రియాల్టీ రంగం ఒడిదొడుకుల్ని ఎదుర్కొంది. అయితే, అప్పట్లో ఎంతో ధైర్యంగా ఆ ప్రతికూల పరిస్థితుల్ని హైదరాబాద్ రియాల్టీ సమర్థంగా అధిగమించింది. అయితే, గత ఐదేళ్లలో ప్రీలాంచ్ బిల్డర్లు రియాల్టీలోకి విచ్చలవిడిగా విచ్చేశారు. వీరికి డబ్బుల కలెక్షన్ మీద ఉన్నంత శ్రద్ధ.. ప్రాజెక్టుని పూర్తి చేయడంలో లేకపోవడం.. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించడం తెలియకపోవడంతో.. ఇలాంటి వారంతా రియాల్టీ నుంచి నిష్క్రమించే అవకాశముంది. మార్కెట్ ప్రతికూలంగా మారడం వల్ల నిర్మాణ రంగంలో ఉన్న చెత్త మొత్తం ఎగిరిపోతుందని కొందరు బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు.
This website uses cookies.