6.3 లక్షల చదరపు అడుగుల స్పేస్ కు రూ.2.8 కోట్ల అద్దె
టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లీజుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రూ.4.3 కోట్ల నెలవారీ అద్దెకు తీసుకున్న సంస్థ.. తాజాగా చెన్నైలోనూ ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకుంది. ఓజోన్ టెక్నో పార్క్ లో 6.3 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని పదేళ్ల కాలానికి నెలకు రూ.2.8 కోట్లు చెల్లించేలా లీజు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్పేస్ మొత్తం ఏడు అంతస్తుల్లో విస్తరించి ఉంది. లీజు ఒప్పందం మార్చి 15న ప్రారంభమైనట్టు పత్రాల్లో ఉంది.
ప్లాటినం హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇందుకోసం టీసీఎస్ రూ.25.5 కోట్ల డిపాజిట్ చెల్లించింది. పదేళ్ల పాటు లీజుకు తీసుకోగా.. మూడేళ్ల లాక్ ఇన్ వ్యవధి ఉంది. అద్దె నెలకు చదరపు అడుగుకు రూ.45 చొప్పున నిర్ధారించారు. అలాగే అద్దె ప్రతి మూడేళ్లకు 12 శాతం పెరిగేలా ఒప్పందంలో క్లాజ్ ఉంది. స్టిల్ట్ పార్కింగ్, ఉపరితల పార్కింగ్ స్థలాలతో సహా మొత్తం 631 పార్కింగ్ స్లాట్‌లు కూడా ఇందులో కలిసి ఉన్నాయి.
ALSO READ: ముంబైలో బాలీవుడ్ రియల్ షో
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 10 లక్షల మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని నెలకు రూ.4.3 కోట్ల అద్దెకు తీసుకుంటూ ఇటీవలే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు చెన్నైలో ఆఫీస్ లావాదేవీలు జోరుగానే సాగాయి. ఈ ఏడాది జనవరిలో వాల్ మార్ట్ 4.6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని రూ.3.26 కోట్ల నెలవారీ అద్దెకు తీసుకుంది. అలాగే మార్చిలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా చెన్నైలోని తన ఇండియా ప్రధాన కార్యాలయాన్ని బాగ్‌మనే కన్స్ట్రక్షన్స్ కు రూ.612 కోట్లకు విక్రయించింది.